Saturday, 4 May 2013

ధర్మపత్నికి విలువనిచ్చిన సంప్రదాయం

భారత దేశం స్త్రీకి గౌరవ స్థానం ఇచ్చితీరాలని ప్రబోధిస్తుంది. స్త్రీ, పురుషులు ఇద్దరు సమమేనని తెలియజేస్తుంది. అలాగే భార్య మాట నొక్కేయటం, ఆమె మాటకు విలువనివ్వని భర్త నష్టాల పాలు కావలసిందేనని వివరించే కథ పంచతంత్రం మిత్రబేధంలో కనిపిస్తుంది.

ఓ సముద్రతీరాన ఉన్న ఒక చెట్టు మీద ఒక పిట్టలజంట గూడు కట్టుకొని హాయీగా కాపురం చేస్తూ ఉండేవి. కొన్నాళ్లకు ఆడ పిట్ట గుడ్లు పెట్టే సమయం వచ్చేసింది. చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిస్థితులని గమనించే ఆడ పిట్ట తన భర్త అయిన మగ పిట్టను పిలిచి సముద్రం పొంగే సూచనలు ఉన్నాయని, ఉవ్వెత్తున ఎగసె అలలకు గుడ్లు కొట్టుకుపోతాయని కాబట్టి ఇక్కడ నుండి వెళ్లి మరో చోట తన గుడ్లు పెడతానని అంది, ఇది విన్న మగ పిట్ట సముద్రుడి గురించి భయపడాల్సిన అవసరం లేదని, సముద్రుడు గరుత్మంతుడు మిత్రులేనని కాబట్టి ఏ ప్రమాదము  ఉండదని చెప్పి, ఆహరం కోసం అక్కడినుండి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న సముద్రుడు భార్య మాట వినని భర్తకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు.



వెంటనే సముద్రుడు తన అలలతో ఉవ్వెత్తున ఎగసి పరిసరాల్ని ముంచెత్తాడు, అక్కడ ఉన్న పిట్ట గుడ్లను సైతం తనలో కలిపెసాడు. కొద్ది సేపటికి మగ పిట్ట అక్కడికి వచ్చి విషయం తెలుసుకుంది. తన భార్య చెప్పినా విననందుకు వాటిల్లిన నష్టానికి బాధపడసాగింది. ఇది జరిగిన తరువాత చాలా కాలం పాటు రెండు పిట్టలు తమ దైవమైన గరుత్మంతుని గూర్చి తీవ్రంగా పూజలు చేస్తూ ప్రార్తించాయి. ఒక రోజు గరుత్మంతుడు కరుణించి, సముద్రుడిని అడిగి పిట్ట గుడ్లు తిరిగి వాటికి అందేలా చేసాడు.

ఈ కథలోని మర్మం గమనిస్తే భార్య మాట వినకపోవడం వాళ్ళ వాటిల్లిన తీవ్ర నష్టాన్ని తెలుసుకోవచ్చు. భార్యను మించిన హితైషి వేరొకరు ఉండరని, కష్టకాలంలో భార్యే తోడుగా నిలుస్తుందని ఈ కథ తెలియజేస్తుంది. 

Tuesday, 30 April 2013

నామ సంకీర్తన

నామ సంకీర్తనమే  ప్రస్తుత జగత్తులో దైవ సాక్షాత్కారానికి సులువైనమార్గం.
దీనిని రుజువు చేస్తూ అనేకానేక ఋషులు, మునులు తరతరాలుగా లోకంలో  ప్రచారం చేస్తూ వస్తున్నారు.  ఈ కోవలోకే వస్తారు భక్త తుకారం, సంత్ జ్ఞానేశ్వర్. వీరే కాకుండా మహారాష్ట్రలో ఇంకా ఎంతో పుణ్యపురుషులు, సంతులు దైవ మహిమను తమ గానల ద్వారా, కీర్తనల ద్వారా జనులకు సామజిక మరియు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేసారు.

భక్త తుకారం తన జీవిత కాలంలో ఎన్నో అభంగాలను (భగవంతున్ని భక్తితో గానం చేసే సంకీర్తనలు) రచించారు. అలాగే అయన సమాజ మాలిన్య నిర్మూలనకు దోహదం చేసే కీర్తనలు (మహారాష్ట్రలో వార్కరి సాంప్రదాయ జనం చేసే ఒకరకమైన భక్తి సామజిక కార్యక్రమం) కూడా చేసేవారు. ఈయన పాండురంగని సేవలో సశరీరంగా వైకుంఠ ప్రాప్తిని పొంది సంతులందరికి ఆరాధ్య దైవమయ్యారు. 


సంత్ జ్ఞానేశ్వర్ కూడా పవిత్రమైన భగవత్గితని అందరికి అర్థమయ్యేలా మరాఠీలో రచించి ఆరధ్యమయ్యారు. ఈయన జన్మించిన ఆళంది నేటికి ఎంతో మంది విద్యార్థులకు వివిద సాంస్కృతిక రంగాలలో ప్రావిణ్యం కలిగిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుస్తూ వున్నది. 

ఈ విధంగా భగవత్ నామ స్మరణ, కీర్తనలు మరియు రచనలు భగవంతున్ని చేరడంలో తోడ్పడతాయి. వీరు ఉన్న సమాజం కూడా ఉన్నతి వైపు పరుగులు తీస్తుంది. 

Monday, 13 June 2011

ద్వాదశాదిత్యుల విశేషాలు

సూర్యుడు ఒక్కడే కాడని, తానే శివునిగా విష్ణువుగా బ్రహ్మగా ఇంకా పన్నెండు భాగాలుగా విడిపోయి పన్నెండు ప్రధాన కార్యాలను నిర్వర్తిస్తున్నాడని భవిష్యపురాణం డెబ్భై నాలుగో అధ్యాయంలో సూర్యద్వాదశమూర్తి వర్ణనం అనే కథలో కనిపిస్తుంది.
    సూర్యుడు మొదట చంద్రభాగనది తీరంలో తపస్సు చేసాడు. అప్పుడు ఆయన పేరు మిత్ర.. ఇక్కడే శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్యుడి మూర్తిని ప్రతిష్టించాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి తొలిగా బ్రహ్మదేవుడు, వక్షస్థలం నుంచి శ్రీమహావిష్ణువు, నుదురుభాగం నుంచి శివుడు, పాదాలనుంచి ఇతర దేవత గణాలన్నీ  ఆవిర్భవించాయి.  సూర్యుడు పన్నెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, పూష, త్వష్ట, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు, అనే పన్నెండు రూపాలుగా ఏర్పడ్డాడు. మొదటిదైన ఇంద్రమూర్తి దేవరాజ పదవిని అలంకరించి ఉంటుంది. ధాత ప్రజాపతిత్వాన్ని వహించి ప్రాణి సృష్టి చేస్తుంది.
    పర్జన్యుడు సూర్యకిరణాలలో ఉండి అమృతాన్ని వర్షిస్తుంది. పూషుడు మంత్రాలలో ఉండి ప్రజలను పోషిస్తుంటాడు. త్వష్ట వనస్పతులలోను, ఔషదాలలోను ఉంటుంది. ఆర్యముడు ప్రజలను ఆవరించి ఉంటాడు. భగుడు భూమి మీద ఉండే పర్వతాలలో ఉంటాడు. వివస్వంతుడు అగ్నిరూపంలో ఉండి ఆహారాన్ని వండుకోవటంలో సహకరిస్తూ ఉంటాడు. అంశుమంతుడు చంద్రుడిలో ఉంటూ ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణువు రాక్షససంహారం చేస్తూ ఉంటుంది. వరుణుడు జలనిధిలో నివసిస్తూ జగత్తుకు జలాన్నిస్తూ ఉంటాడు. మిత్ర లోకహితం కోసం చంద్రభాగానది తీరంలో ఉంటుంది. భక్తులను అనుగ్రహిస్తూ వరాలివ్వడమే మిత్రదేవుడి లక్ష్యం. అందుకే ఆ ప్రదేశానికి మిత్రపదం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడు లోక సంరక్షనార్థం ఇలా వివిధ రూపాలుగా విడిపోయాడు. ఇతర ఏ దేవతలు కనిపించకపోయినా కర్మసాక్షి అయిన సూర్యుడు మాత్రం నిరంతరం కనిపిస్తూనే ఉంటాడు. అణువణువునా ఆయన రూపమే ఇమిడి ఉందని ఆయనను భక్తి ప్రపత్తులతో పూజించడం మేలని భవిష్యపురాణం వివరిస్తుంది.

Monday, 6 June 2011

గజచర్మాంబరధారి.. శివధరుడు

సాక్షాత్తు శివున్నే ధరించినవాడు ఎవ్వడు? శివుడు గజ చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు? అనే విషయాలను ఈ కథ సందర్భం తెలియచేస్తుంది. పూర్వం కుమారస్వామితో తారకాసుర వధ జరిగిన తరువాత లోకాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి. తరువాత అదే తారకాసుర వంశంలో జనించిన వాడే గజాసురుడు. ఇతడు బ్రహ్మ ద్వారా వరాలు పొంది మూడులోకాలను  జయించి వాటిని పాలించసాగాడు. ఇది దేవతలకు ఇబ్బందిగా పరిణమించింది. అంతేకాక గజాసురుడు గొప్ప శివభక్తుడు. ఇతడు నిత్యం శివారాధన చేసేవాడు.
    ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు గజాసురుడి కొలువుకి వచ్చి గజాసురుడి మర్యాదకు ప్రసన్నుడై, నిరంతర శివభక్తి కలిగిన నీవు స్వయం శివున్నే నీ హృదయాన ప్రతిష్టించుకో...అని సూచన చేసాడు. ఇది గొప్ప అదృష్టమని నారదుడు అనడంతో గజాసురుడు వెంటనే పరమేశ్వరుని గురించి గొప్ప తపమాచరించి శివున్ని ప్రసన్నం చేసుకొన్నాడు. అప్పుడు గజాసురుడు శివున్ని వినమ్రంగా నమస్కరిస్తూ, నివోకచోట నేనోకచోట ఉండడం భావ్యం కాదని నిరంతరం తన హృదయంలో ఉండిపొమ్మని కోరుకున్నాడు. భక్తవత్సలుడైన శివుడు అనుగ్రహించి లింగరూపాన్ని ధరించి గజాసురుడి హృదయంలోకి ప్రవేశించాడు.
    రుద్రుడు లేక కైలాసం కల్లోలమైంది. రుద్రగణాలు, ప్రమథగణాలు వెతికి నీరసించిపోయాయి. తిరిగి చేసేది లేక పార్వతిదేవి విష్ణువుని ఆశ్రయించింది. విష్ణువు పార్వతికి అభయమిచ్చి,ఓదార్చి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడికే ఇంద్రాది దేవతలను రప్పించి, వారంతా ఒక గంగిరెద్దుల ఆట ఆడించే వారిలా మారు వేషాలు ధరించి గజాసురుడు ఉండే షోణితపురానికి వెళ్ళారు. ఆ ఆటలో నందీశ్వరుడు గంగిరెద్దుగా, బ్రహ్మ సన్నాయిని వాయించే వాడుగా, ఇంద్రుడు జేగంట కొట్టే వాడుగా, భ్రుంగి వీరణాలు వాయించే వాడుగా వీధుల్లో తిరుగుతూ గజాసురుడి మందిరానికి చేరుకున్నారు. వారు పాడే శివభక్తి గీతాలకు గజాసురుడు ప్రసన్నుడై వారిని పిలిపించి గేయాలను పాడించుకున్నాడు.
    ఆ గేయాలను వింటున్న పరమశివుడు ఆనందిస్తూ, గంగిరెద్దు నాట్యం చూస్తూ తన రూపాన్ని పెంచాసాగాడు. ఇది గమనించిన గజాసురుడు తనకు మరణం తప్పదని భావించి శివున్ని శరణువేడాడు. అప్పుడు శివుడు గజసురుదితో, నీ మరణం ఆసన్నమైనదని ఇంకేదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు గజాసురుడు తన శిరస్సు పూజార్హత కలిగి ఉండేలా, తన చర్మం శివుడు ధరించేలాగా, జన్మరాహిత్యం కలిగేల వరం ప్రసాదించమని వేడుకొన్నాడు. శివుడు ఆ కోరికను మన్నించి త్రిశులదారియై గజాసురుడి పొట్టను చిల్చుకొని బయటికి వచ్చాడు. తరువాత గజాసురుడి తలను భద్రపరిచారు. గజాసురుడి చర్మాన్ని ధరించి శివుడు గజచర్మాంబరదారిగా ప్రసిద్దికెక్కాడు. గజాసుర సంహారంతో దేవతలంతా సంతోషించారు.

Sunday, 29 May 2011

శివుడు చెప్పినట్లు చేద్దాం

శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంతటి ఆ లయకరకుడు మానవాళికి పుణ్యసంపాదన కొన్ని కొన్ని సులభ మార్గాలని ఉద్దేశించాడు. ఈ విషయాలన్నీ మహాభారతం అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఒక రోజు పార్వతిదేవి పరమేశ్వరుడిని మానవులు ఏం చేస్తే సులభంగా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చో చెప్పమని అడిగినప్పుడు శివుడు స్వయంగా ఆమెకు ఇలా వివరించాడు.
    ప్రాణాన్ని కలిగి ఉన్న ప్రతి జీవికి నీరు ఎంతో అవసరం. అలాంటి జలాన్ని దానం చేయడం ద్వార స్వర్గ సుఖం కలుగుతుంది. బంగారాన్ని దానం చేస్తే దాతకు పవిత్రత చేకూరుతుంది. గోవు ప్రత్యక్ష దైవమె. అలాంటి గోవును జ్ఞానవంతుడికి దానంమిస్తే ఆ గోవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలపాటు దాతకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందులో కపిల గోవుదానం ఇంకా ప్రశస్తమైనది. భూమిని దానం చేసిన వారికి భూమి ఉన్నంతకాలం స్వర్గసౌఖ్యం కలుగుతుంది. భూమి నుంచి అనేకానేక వస్తువులు ఉద్భావిస్తుంటాయి. కనుక భూమిని దానం చేసిన వారికి ఆయా వస్తువులు దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. భూదానం వల్ల ఎన్నెన్నో పాపాలు తొలగిపోతాయి. దానాలలో కన్యాదానంవల్ల దేవతలంతా సంతోషిస్తారు. కన్యదాతకు తేజం, సంపద, కీర్తి కలుగుతాయి.
    విద్యను మంచి శిష్యుడికి దానం చేస్తే దానివల్ల గురువుకు తరిగిపోని ఆనందం కలుగుతుంది. తగిన ధనమిచ్చి పేదలకు విద్యను చెప్పించటం వల్ల విద్యాదాన ఫలం లభిస్తుంది. నువ్వుల రాశిని దానమిస్తే అగ్నిష్టోమయజ్ఞం చేసినంత ఫలం, వస్త్రాలను దానమిస్తే దీర్ఘాయువు, గోడుగుని ఇస్తే బాధలనుంచి విముక్తి, దాసదాసిజనులను దానమిస్తే కర్మ విముక్తి, దీపదానం వల్ల నిర్మలాత్మత. ప్రవాహాన్ని, నదిని దాటడానికి ఎవరికైనా సహయంచేస్తే వ్యసనాల వల్ల కలిగిన పాపాలు తోలగేలాంటి పుణ్యం లభిస్తుంది. అందరూ నడిచే దోవను శుభ్రం చేస్తే సంతానప్రాప్తి, ఔషదాల దానం వల్ల రోగ బాధల నివృత్తి, బాటసారికి ఆశ్రయం ఇచ్చినందువల్ల శరీర సౌఖ్యం కలుగుతాయి.
    యజ్ఞాలు వైదికమని, లౌకికమని రెండు విధాలుగా ఉన్నాయి. రుత్విక్కులకు తృప్తి కలిగేల చేసేది వైదిక యజ్ఞం. దేవతలకు మహోత్సవాలు చేయడం, భజనలు నృత్యాలను ఏర్పాటు చేయడం, గంధం పూలమాలలు దుపదీపాలు నైవేద్యాలు భక్తితో నివేదించటం లౌకిక యజ్ఞం. ఈ రెండు హితమైనవే. చక్కగా శాస్త్రవిధిగా చేసిన యజ్ఞానికి దాన, ధర్మాలు సాటిరావు. దేవతలు మానవుల మనసులను గమనిస్తూవుంటారు కనుక చిత్తశుద్దితో యజ్ఞాలైనా, దానాలైనా చేయాల్సి ఉంటుంది. పితృకార్యాలు చేయడం వల్ల కూడా గొప్పపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ కార్యాలు చేసేటప్పుడు ఏమరుపాటు లేకుండా ఉండటం ముఖ్యం. సత్ప్రవర్తన కలిగిన వారిని అర్చించి పితృకార్యం చేసే రోజున భోజనం పెట్టి, వస్త్రాలను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల సర్వత్ర శుభం కలుగుతుందని పార్వతికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు.

Tuesday, 24 May 2011

ఉత్తమలక్షణం క్షమ

మనిషికి క్షమాగుణం ఎంతగా ఉపయోగపడుతుందో, జటిలమైన సమస్యలు దీని ద్వారా ఎంత సులభంగా పరిష్కరించబడతాయో కొన్ని పురాణ పరమైన కథలు తెలియజేస్తాయి. ఆ కోవకు చెందిన ఒక కథ రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడి పూర్వచరిత్రకు సంబంధించి ఉంది.
    పూర్వం కుశుడు అనే గొప్ప తపోధనుడు ఉండేవాడు అతడు ఎంతో ధర్మాత్ముడు. ఈయనకు విదర్భ రాజు కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు కలిగారు. వీరిలో కుశనాభుడు ఒకడు. ఇతను మహొదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతు ఉండేవాడు. ఇతడు ఘ్రుతాచి అనే అప్సరసను వివాహమాడాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కలిగారు. వీరు తండ్రి ధర్మలక్షణాలు, తల్లి అందచందాలు కలగలిసి, గొప్ప జ్ఞానవంతులుగా పెరిగి పెద్దయ్యారు.
    ఒక రోజు ఈ రాకుమార్తెలు వన విహారానికి వెళ్లారు. అక్కడ వీరు ఆడుకొంటూ ఉండగా పెద్ద గాలి వీచి వాయుదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వాయుదేవుణ్ణి చూసి వినయ సంపన్నులైన రాకుమార్తెలు ఆయనకు నమస్కరించారు. వాయువు వారితో తాను ఆ ముగ్గురిని చూసి సమ్మోహితుడైనట్లు చెప్పి తనను వివాహమాడాలని కోరాడు. రాకుమార్తెలు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. వెంటనే వారు వాయువుతో తాము తండ్రి చాటు బిడ్డలమని, వివాహం విషయంలో తండ్రి అనుమతి లేనిదే తామేమి మాట్లాడబోమని అన్నారు.వాయుదేవుడు తనను పెళ్లాడితే నిత్య యౌవ్వనం లభిస్తుందని, కాదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయిన ఆ ముగ్గురు రాకుమార్తెలు తండ్రి మాటే తమదని కచ్చితంగా తెగేసి చెప్పారు. దాంతో వాయుదేవుడికి కోపం వచ్చి ఆ ముగ్గురిని అందవిహీనులై, గూని వారుగా మారిపొమ్మని శపించి వెళ్ళిపోయాడు. అయిన వారు బాధ పడలేదు, వారికి వాయుదేవుడిని శపించెంత శక్తి ఉన్న వారు ఆ పని చేయలేదు. తండ్రి దగ్గరికి వచ్చి విషయాన్నంతా వివరించారు. కుశనాభుడు తన కుమార్తెలకు తగిన వరుణ్ణి వెదికి బ్రహ్మదత్తుడనే గొప్ప తపోశక్తి కలిగిన రాజుకి ఇచ్చి వివాహం చేయించాడు. దాంతో వారికి శాపం తొలగిపోయి వారి నిజరూపాలు వచ్చాయి. కుశనాభుడు తర్వాత పుత్రకామేష్టి యాగం చేసి గాధి అనే కుమారున్ని పొందాడు. గాధికి విశ్వామిత్రుడు, సత్యవతి జన్మించారు. సత్యవతి విశ్వామిత్రుడి అక్క.
    ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది రాకుమార్తెల క్షమాగుణం. తమకు వాయుదేవుణ్ణి శపించెంత శక్తి ఉన్నప్పటికీ క్షమ గుణాన్ని ప్రదర్శించి ఓర్పు వహించారు. విషయం మరింత తీవ్రం అవ్వకుడదని వాయువు పై కోపాన్ని చూపక తమ తండ్రికి విషయాన్నీ తెలియజేసారు. కొద్దిగా ఆలోచిస్తే ఓర్పు, క్షమా అనే గుణాల్ని కలిగి ఉండటం మేలు అని తెలియజేస్తుంది ఈ కథ సందర్భం.

Saturday, 21 May 2011

పుణ్యదాయిని విష్ణుప్రియ తులసి

కార్తిక పురాణం తులసి మహిమను వివరిస్తుంది. జలంధరుడికి, పరమేశ్వరుడికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మదేవుడి సహాయంతో ఈశ్వరుడు తన చక్రాయుధంతో జలంధరుడిని చేదించాడు. ఆ జలంధరుడి నుండి వెలువడిన కాంతి ఈశ్వరుడిలో కలిసిపోయింది. రాక్షసుడి మరణంతో దేవతలంతా ఆనందించారు. అప్పుడే దేవతలకు మరొక సమస్య ఎదురయింది. బృంద మోహంలో ఉన్న విష్ణువు ఆమె ఆహుతి అయిన ప్రదేశంలో సంచరించసాగాడు. అప్పుడు దేవతలంతా ఆ మహామాయను శరణువేడారు. ఆమె సంతసించి విష్ణువు మొహం నుంచి తేరుకోవడానికి తాను సరస్వతి, లక్ష్మి, పార్వతుల అంశాలు నిండిన కొన్ని బీజాలను దేవతలకిస్తున్నట్లు, వాటిని తీసుకెళ్ళి బృంద ఆహుతై విష్ణువు తిరుగుతున్న ప్రాంతంలో చల్లమని చెప్పింది. దేవతలు అల చేయగానే అక్కడ ఉసిరి, తులసి, మాలతి అనే మొక్కలు ఆవిర్భవించాయి. సరస్వతి అంశతో ఉసిరి, లక్ష్మి అంశతో మాలతి, పార్వతి అంశతో తులసి ఆవిర్భవించాయి.
    ఈ మూడింటిని విష్ణువు తిలకించసాగాడు. ఇందులో లక్ష్మి అంశతో ఉన్న మాలతి ఈర్ష్య స్వరుపినిగా కనిపించి విష్ణువుకు దూరమయింది. తులసి, ఉసిరి మాత్రం ఇసుమంతైన అసూయ లేకుండా అనురాగపురితంగా ఉండడంతో విష్ణువు మనస్సును ఆకర్షించాయి. అప్పుడు విష్ణువు మొహం తొలగిపోయి తులసి, ఉసిరి సమేతంగా దర్శనమిచ్చాడు.
    తులసి వనం ఉన్నచోట పుణ్యతీర్థం ఉన్నట్లే లెక్క. సర్వపాపాలను నశింపచేస్తుంది. తులసి సేవనం గంగాస్నానం, నర్మదా దర్శనంతో సమానం. ఈ మొక్కను నాటిన, తాకిన, పెంచినా సర్వపాపాలు హరిస్తాయి. ద్వాదశి నాడు మాత్రం ఎవరూ తులసిదళాలను కోయకూడదు. ఉసిరి చెట్టు కూడా అత్యంత పవిత్రమయినదని కార్తిక పురాణం పేర్కొంటోంది. ఉసిరి కాయలను తాకిన, పాత్రలతో కాని, కాయలతో కాని దేవతపూజ చేసినా అత్యంత పుణ్యదాయకమవుతుంది. సమస్త దేవతలు కార్తిక మాసంలో ఉసిరిచెట్టుని ఆశ్రయించి ఉంటారు. ఈ చెట్టు నీడన కార్తికంలో భోజనంచేస్తే సంవత్సర పాపదోషం నశిస్తుంది. ఈ చెట్టు నీడన విష్ణుపూజ పుణ్యదాయకం. ఇలా ఉసిరి, తులసి మహాత్మ్యాన్ని కార్తీకపురాణం పేర్కొంటోంది. నేటి కాలంలో కూడా తులసి, ఉసిరి గుణాలను ఎన్నింటినో మనం గుర్తిస్తూనే ఉన్నాం.