Tuesday 19 April 2011

ఇహపరలోక విశేషాలు

పరము అంటే ఏమిటి? పరలోకాలు అని వేటినంటారు? అనే విషయాలుకు మార్కండేయ పురాణంలోని వివరణ కన్పిస్తుంది. ఏ జీవుడైనా పుట్టడానికి తన పూర్వజన్మలో తాను చేసిన సుకృత, దుష్కృతకర్మలే ప్రధాన కారణం. అలంటి జన్మలను ఎన్నింటినో పొందుతుంటాడు. గత జన్మలలోని కర్మఫలం మంచిదైతే జీవుడు స్వర్గాది భోగాలను అనుభవిస్తాడు. ఆ కర్మఫలం నీచమైనదైతే నరకలోక బాధలను పొంది, ఆ తర్వాత పశుపక్ష్యాది జంతువులలో జన్మిస్తాడు. అటు చెడుకి, ఇటు మంచికి మధ్యమ ఫలం ఉన్న కర్మ వల్ల కొంత వరకు మనిషిగా పుట్టడానికి వీలు ఉంది. ఈ కర్మఫలమే మరో మూడు రకాలుగా ఉంది. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనేవి ఆ మూడు రకాలు. సంచితం అంటే పూర్వ జన్మలలో సంపాదించుకొన్న కర్మల వల్ల సమకూరిన ఫలితం. ప్రారబ్ధం అంటే పూర్వజన్మలో చేసిన కర్మలవల్ల ఈ జన్మలో అనుభవిస్తున్న ఫలితం. ఆగామి అంటే ఈ జన్మలో చేసి భవిష్యత్ జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉనా కర్మ ఫలం. ఇంతకు ముందు ఏడు జన్మలలో చేసిన కర్మ మానవుడికి ప్రస్తుత జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రారబ్ధాన్ని ప్రతి మనిషి పురుషుడైన, స్త్రీ అయినా ఎలాంటి బేధము లేకుండా ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదు. గత జన్మలలో మంచి చేసుకొని ఈ జన్మలో మోక్షాన్ని పొందొచ్చు. మోక్షమంటే జీవుడు దేవుడిలో లీనం కావటం. ఇలా మోక్షాన్ని పొందగల శక్తి, అర్హత మనుషులకు తప్ప పశుపక్ష్యాదులకు ఇతర జంతువులకు లేదు.
    అందుకే అన్ని జన్మలలో మానవ జన్మ విలువైనది, గొప్పది. పశుపక్ష్యాదులు ఇదివరకు చివరి జన్మలో పొందిన మానవజన్మలో చేసిఅన పాపపు ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాయే తప్ప ఆగామికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకొనే అవకాశం ఉండదు. వాటికీ మానవులకు ఉన్నట్లుగా బుద్ధి, జ్ఞానం అనేవి ఉండవు. బుద్ధి పూర్వకంగా చేసిన కర్మఫలమే అనుభవించడానికి వీలుగా ఉంటుంది. బుద్దిలేని కారణంగా పశుపక్ష్యాదులు పుణ్యాన్ని సంపాదించుకోవటం దాదాపు లేనట్లు గానే పెద్దలు చెపుతారు. ఎక్కడో ఒకటి రెండు సందర్భాల్లో అది దైవసంకల్పం వల్ల పశువు, పక్షి లాంటివి వాటికీ తెలియకుండానే దైవ కార్యంలో పాలుపంచుకున్నప్పుడు మోక్షప్రాప్తి కలిగినట్లు పురాణాలలో ఒకటి రెండు కథలలో కనిపిస్తున్నాయి. పశుపక్ష్యడులకన్న భిన్నంగా ఉండేందుకే దైవం మనిషికి బుద్ధిని అనుగ్రహించాడు ఆ బుద్ధిని వికసింపజేసుకోవడానికి విద్య ఎంతో ఉపకరిస్తుంది. విద్యాభ్యాసం వల్ల వినయము, దీనివల్ల ధనము సంపాదించుకోవచ్చు. దానం వల్ల దాన, ధర్మాలు చేసే శక్తి రావటం, ఆ కార్యాల వల్ల ఇహ పర సుఖాలను పొందడం అనేది జరుగుతుంది. విద్య వల్ల పాపం ఏమిటో, పుణ్యం ఏమిటో మనిషి తెలుసుకోగలడు. విద్య వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఇహలోక సుఖాలు క్షనికమని తెలుసుకొని, పరలోక సంబందమైన మోక్షప్రాప్తి కోసమే కృషి చేసేందుకు మనిషికి అవకాశం కలుగుతుంది. ఇహలోకంలో సుఖలనుభావించడానికి కావలసిన జ్ఞానం వేరు, పరలోక సంబంధంగా ఉన్న మోక్షాన్ని జ్ఞానాన్ని పొందడం వేరు.
    పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానమంటారు. సద్గురువు దగ్గర ఉపదేశం పొంది ఆయన చెప్పిన మార్గంలో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. పరలోకాలు ప్రధానంగా నాలుగున్నాయి. వాటిలో మొదటిది స్వర్గం. దీనికి దేవేంద్రుడు అధిపతి. రెండోది బ్రహ్మలోకం, దీన్నే సత్యలోకమని అంటారు, బ్రహ్మ అధిపతి. మూడో లోకం కైలాసం, దీనికి ఈశ్వరుడు అధిపతి. నాలుగో లోకం పేరు వైకుంఠం. దీనికి అధిపతి శ్రీమహావిష్ణువు. ఈ అనుభవించాల్సిన సుఖలన్ని అనుభవించాక ఆ జీవుడు మళ్ళి భూలోకంలో జన్మిస్తాడు. శాశ్వతంగా పరలోకాలలో భగవంతుడిలో లీనమై ఉండాలనుకుంటున్నవారు తమ జన్మంతా మంచిని ఆచరిస్తూ ముందుకు సాగాలని మార్కండేయ పురాణం పేర్కొంటోంది.

Sunday 17 April 2011

బ్రహ్మరాత ఎలా ఉంటె అలా...

సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు "బ్రహ్మ రాత ఎలా ఉంటె అలా జరుగుతుంది", "ఆయన ఇచ్చిన ఆయుష్హు ఉన్నంత వరకు బతుకుతూనే ఉంటాం" అని అంటూ ఉండడం కనిపిస్తుంది. అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది.
    రావణాసురుడు బ్రహ్మ దగ్గరి నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు, ఋషులు సహా సర్వలోకాల్ని బాదించసాగాడు. రాక్షసానందంతో ఆ అసురుడు పుష్పక విమానమెక్కి లోకాలన్నింటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశమార్గాన నారదముని ఎదురయ్యాడు. నారదుడికి నమస్కరించి రావణుడు కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు ఎంతో సంతోషించి రావణుడి ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు. దేవతలందరినీ జయించడమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అంతగా కష్టపడి అందరి మరణానికి కారకుడైన యమధర్మరాజును జయించినందువల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని, ఆ ప్రయత్నం చేసి చూడాలని చెప్పాడు. యమపురికి వెళ్ళే మార్గం చాల కష్టతరమైందని నారదుడు రావణుడిని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. రావణుడు వెంటనే యమపురికి బయలుదేరాడు.
    ఇంతలో నారదుడు వెళ్లి యమధర్మరాజుకు రావణాసురుడు యుద్ధానికి వస్తున్నట్లు చెప్పాడు. నారదుడు అలా చెప్పుతున్నంతలోనే గొప్ప కాంతులతో విరాజిల్లుతున్న పుష్పక విమానమెక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు. ఎన్నో పాపాలు చేసి వాటికి తగిన ఫలితాన్ని అనుభవిస్తున్న ఎందరెందరినో రావణాసురుడు అక్కడ చూసాడు. భయంకరమైన రూపాలు కలిగిన యమకింకరులు అక్కడ ఉన్నారు. ఆ కింకరులు పెట్టె బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండడం కనిపించింది. కొంత మంది పురుగులకు, మరికొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకలు పెట్టడం కనిపించింది. మరికొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరణి నదిని దాటి కాలుతున్న ఇసుకలో దొర్లాడుతూ పెడబొబ్బలు పెడుతూ యాతనలు పడుతున్నారు. మరికొంతమంది పున్యత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూసాడు. గీత వాద్యాలను వింటూ కొంత మంది సంతోషిస్తున్నారు. గోదానం చేసిన వారు పాలను, అన్నదానం చేసిన వారు గృహవాస సుఖాన్ని అనుభవిస్తూ కనిపించారు. యమభటుల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపాత్ములు కొంత మందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు. పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవడంతో యమభటులకు కోపం వచ్చింది. వెంటనే ఆ భటులంతా రావణాసురుడినీ, అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్పక విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేసారు. బ్రహ్మ వరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్లీ మాములుగా ప్రత్యక్షమైంది. యమభటులు, రావనసేన ఘోరాతిఘోరంగా యుద్ధం చేయసాగారు. యమభటులు మంత్రులను విడిచిపెట్టి రావణాసురుడిపైకే శూలవర్శన్ని కురిపించారు. ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు, కవచం పడిపోయింది, కొద్ది క్షణాలు ఆగి మళ్లీ లేచి పాశుపతాస్త్రాన్ని సంధించాడు. యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు. వెంటనే రావణుడు అతడి మంత్రులు జయజయధ్వానాలు చేశారు.
    ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన వెంట మూడు లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యుదేవత బయలుదేరింది. యమధర్మరాజు కాలపాశంతోను, ముద్గురం లాంటి ఆయుధాలతోను రావణుడి మీద అగ్రహించి బయలుదేరాడు. అలా కోపంతో వస్తున్న యమధర్మరాజుని చూసి రావణాసురుడి మంత్రులంతా తలా ఒక దిక్కుకు భయంతో పరుగెత్తారు. యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్కచేయలేదు. అలాగే మొండిగా నిలుచున్నాడు. యముడు మరీ కోపంతో తన దగ్గరున్న శక్తి, తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు. ఆ ఆయుధాల దెబ్బలు తగిలినా రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. ఆ యుద్ధం చూడటానికి దేవతలు, గంధర్వులు, ఋషులు, బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు. రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యుదేవత పైకి నాలుగు బాణాలు, యముడి మీదకు అనేకానేక బాణాలను వదిలాడు. అందుకు కోపించిన యముడు ముక్కుపుటలనుంచి గొప్ప అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఆ అగ్ని రావణాసురుడిని దాహిస్తుందని మృత్యువు, యముడు అనుకున్నారు. అలా జరగక పోయేసరికి మృత్యువు యముడితో తనను రావణుడి మీదకు వదలాలని, వాడిని నాశనం చేసి వస్తానని పలికింది. యముడు తానే స్వయంగా రావణుడిని సంహరించాలని తన చేతిలో ఉన్న కాలదండాన్ని పైకెత్తాడు, శత్రువు మీదకి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాశం, ముద్గరం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి.
    ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంత గజగజ వణికిపోయారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని యముడిని వారించాడు. కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించడం తప్పదని, అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్లుగా అవుతుంది కనుక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి నచ్చజెప్పాడు. బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. రావణాసుర చరితంలోని ఇలాంటి సన్నివేశాలు, ఆ రాక్షసుడు బ్రహ్మ వళ్ళ వరం పొంది దేవతలను ఎంతగా ఇబ్బంది పెట్టాడో విశదం అవుతుంది. ఇలాంటి అనేకానేక కారణాలు రామావతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి.

Friday 15 April 2011

ఈ జగం ఎవ్వనిలో నుంది



ఈ జగత్తునంతా నిరంతరం భరిస్తున్నవాడు ఎవ్వడు? అందరిని తన కడుపులో దాచుకొని కాచి కాపాడుతున్నవాడు ఎవ్వడు? అనే ప్రశ్నలకు సమాధానం పద్మనాభుడు అని అంటోంది విష్ణుధర్మోత్తర పురాణం డెబ్బై తొమ్మిదో అధ్యాయంలోని మార్కండేయ పద్మనాభోపఖ్యానం. ఆ అనంతపద్మనాభస్వామి గురించి మార్కండేయ మహర్షి వజ్రుడికి వివరించి చెప్పాడు. "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు..." అంటే దానికి సమాధానం పద్మానాభాస్వామేనని స్పష్టం చేసాడు ఈ సందర్భంలో మార్కండేయుడు దీనికి సంబందించిన ఓ మహత్తర సన్నివేశాన్ని ఇలా వివరించాడు.
    ఓసారి కల్పాది సమయంలో బ్రహ్మదేవుడికి ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు ఎవరో బ్రహ్మకు బోధపడలేదు. నీవు ఎవరు? అని బాలుడిని బ్రహ్మ అడిగాడు. అప్పుడతడు చిరునవ్వు నవ్వుతూ ఈ సృష్టి అంతా తనదేనని చెప్పాడు. సకల చరాచర సృష్టిని చేసేవాడిని నేనైతే సృష్టి చేస్తున్నది నీవని అనటంలో సత్యం లేదు కదా! అని బ్రహ్మ ఆ బాలుడితో అన్నాడు. ఈ సృష్టి తన చేతనే జరిగిందని, ప్రస్తుతం సర్వలొకలూ తన ఉదరంలోనే ఉన్నాయని, కావాలంటే లోపలికి వెల్లి చూడమని బ్రహ్మ అతడితో చెప్పాడు. బ్రహ్మ ఉదరంలోకి ప్రవేశించిన ఆ బాలుడు ఓ క్షణం పాటు అక్కడే తిరిగి వెంటనే పైకి వచ్చాడు వచ్చి రాగానే ఈ సృష్టి ఎవరిదో నీవు తెలుసుకోవాలంటే నా ఉదరంలోకి వెళ్ళి చూడు అని పలికి శేషతల్పషాయి అయి హాయిగా విశ్రమించాడు ఆ బాలుడు. బ్రహ్మ ఆ బాలుడి ఉదరంలోకి ప్రవేశించాడు. లోపల పాతాళాది సర్వలోకాలు, వనాలూ, పర్వతాలు, సముద్రాలూ అన్ని కనిపించాయి. బ్రహ్మ ఆ లోకాలన్నిటిని తిరగసాగాడు. ఎంత తిరిగిన ఒక మూల కూడా పూర్తి కాలేదు అలిసిపోయిన బ్రహ్మ తను ఎలా బయటపడాల అని ఆలోచిస్తుంటే బయటకు వెళ్ళటానికి మార్గమే కనిపించలేదు అప్పుడు బ్రహ్మదేవుడు తనకు తొలుత కనిపించిన దివ్య స్వరూపాన్ని స్మరించి శరణు వేడాడు. ఆ శరనాగాతవత్సలుడు  కరుణించి లోపల నుంచి బయటకు వెళ్ళటానికి చిన్నపాటి రంద్రమైన ఉంటుందేమోనని బ్రహ్మదేవుడు చుట్టూ పరికించాడు. ఎక్కడ అటువంటిది కనిపించలేదు. ఏదైనా దోవ చూసుకొని బయటకు వచ్చేందుకు శక్తి లేకపోయింది. బ్రహ్మ వేడుకోలు విన్న ఆ దివ్య పురుషుడు వెంట్రుక కోన కంటె సూక్ష్మమైన ఒక రంద్రాన్ని బ్రహ్మకు కనిపింపచేసాడు. బ్రహ్మ ఆ రంద్రం నుంచి మెల్లగా బయటపడ్డాడు. ఆ వస్తున్న మార్గం ఒక తామర తూడు లాగ బ్రహ్మదేవుడికి అనిపించింది బయటకు వచ్చి చూసేసరికి తానొక అద్బుత పద్మంలో ఉన్నాడు. అలా పద్మం నించి ఆనాడు బ్రహ్మ బయటపడిన కారణం గానే పద్మజన్ముడు అనే పేరొచ్చింది.
    కిందికి పరికించి చూస్తే ఆదిశేషుడి మీద చిద్విలాసంగా పవళించి ఉన్న శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చాడు. బ్రహ్మ ఉన్న పద్మపు తూడు విష్ణువు నాభిలో నుండి వెలువడినట్లు కనిపించింది. ఆ పద్మం సర్వ బ్రహ్మ మండలంగా మేరుపర్వతం ఆ పద్మానికి దుద్దుగా కనిపించింది.
    అందరు అనుకుంటున్నట్లుగా అసలు సృష్టికర్త తను కానని, బ్రహ్మ దేవుడు మార్కండేయుడికి చెప్పాడు. జగన్నాటక సూత్రధారి, జగద్రక్షకుడు, సర్వసృష్టికర్త పద్మనాభుదేనని బ్రహ్మ మాటల రూపంలో ఈ కథ సందర్భం వివరిస్తుంది.

Wednesday 13 April 2011

ధర్మ రక్షణ.

జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. భాగవత కథల్లో శ్రీకృష్ణుడు బాల్యంలో, ఆ తర్వాత గోపికలతో చేసిన రాసలీలల్లో  శ్రీకృష్ణుడు సంతోషించిన తీరుకు, మహాభారతంలో తాను అమితంగా ప్రేమించే పాండవుల్లో బలవంతుడైన భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు కర్ణుడి శక్తికి గురై అర్ధరాత్రి రణరంగంలో మరణించినప్పుడు కృష్ణుడు నవ్విన నవ్వుకు ఎంతో భేదం ఉంది. ద్రోణ పర్వంలో కురుక్షేత్ర రణరంగ ఘట్టంలో శ్రీకృష్ణుడు సంతోషించటానికి ఘటోత్కచుడి మరణం కారణంగా కనిపించింది. 
    తాము ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకుంటున్న శౌర్యవంతుడైన ఘటోత్కచుడు కర్ణుడు ప్రయోగించిన శక్తికి గురై మరణించాడు, అప్పుడు పాండవులంతా విపరీతమైన దుఃఖంలో మునిగిపోయారు. కృష్ణుడు మాత్రం తన పక్కనే ఉన్న ఆర్జునుడిని కౌగలించుకొని ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. కృష్ణుడు ఇలా ప్రవర్తించిన తీరు అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుండగా అర్జునుడు కృష్ణుడిని ఎందుకిలా ప్రవర్తిస్తున్నవని అడిగాడు
     తామంత దుఖిస్తుంటే అది  కృష్ణుడికి సంతోషదాయకంగా ఎలా అయిందని ప్రశ్నించాడు. అందుకు బదులుగా కృష్ణుడు తన ముఖంలో నవ్వు చేరగకుండానే అర్జునుడితో ఇలా అన్నాడు.
    అర్జునా ఘటోత్కచుడి మరణం నాకు నిజంగానే అమితానందం కలిగిస్తోంది. కర్ణుడు ప్రయోగించిన శక్తి అతడిని మట్టుపెట్టకుండా ఉన్నట్లయితే అది నిన్ను దహించివేసేది. ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉన్నంత కాలం కర్ణుడిని ఎదిరించి జయిoచగలవారు మరెవరు ఉండబోరు. ఇంద్రుడు కర్ణుడి దగ్గర ఉన్న కవచకుoడలాలను తెలివిగా స్వీకరించినప్పటికి యుద్ధంలో ఒక వీరపురుషుడిని సంహరించగల శక్తి మాత్రం కర్ణుడి దగ్గరే మిగిలి ఉంది. ఆ శక్తి అతడి దగ్గర ఉన్నంత కాలం అతడికి తిరుగులేదు. కాని ఇప్పుడాశక్తి ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు ఇక కర్ణుడు సులభంగా యుద్ధంలో మరనించేందుకు అవకాశం ఏర్పడింది అలాగే ఘటోత్కచుడు చిరకాలం జీవించతగిన వాడు కూడా కాదు. అతడు భీముడి కుమారుడైనప్పటికీ దుర్మార్గవర్తనుడు. యుద్ధంలో ఘటోత్కచుడు అలంబుషుడు తదితరులను చంపడానికి ఉపయోగపడ్డాడు. అతడి వల్ల ప్రయోజనం అంత వరకే ఉంది. 
    యజ్ఞాలను ద్వేషించేవాడు, అధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, పాపాత్ముడు అయిన వాడు కనుకనే ఘటోత్కచుడు ఇప్పుడిలా మరణించాడు. వీడి పాపాలను ఇప్పటివరకు ఉపెక్షించింది మిమ్ములను దృష్టిలో ఉంచుకొనే. మీరు వ్యధకు గురవుతారని అలా కావటం మానసిక స్థైర్యాన్ని దిగజార్చి ఉద్దంలో ఇబ్బంది పడతారనే ఘతోత్కచుడిని ఇప్పటి దాకా కాపాడుతూ వచ్చాను. కర్ణుడు నిన్ను చంపటానికి దాచి ఉంచిన శక్తి వాడి మీద పడి నీకు మేలే జరిగింది. అందుకే నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తన సంతోష కారణాన్ని తెలిపాడు. శ్రీకృష్ణుడు భగవత్గితను ఉపదేశిస్తూ ధర్మానికి ఎక్కడ విఘాతం కలుగుతుందో అక్కడ, అప్పుడు తను ఉద్భావిస్తానని ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన ధర్మసందేశం ఘటోత్కచుడి మరణ సన్నివేశంలో శ్రీకృష్ణుడు ప్రవర్తన వల్ల రుజువైంది.