Sunday, 17 April 2011

బ్రహ్మరాత ఎలా ఉంటె అలా...

సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు "బ్రహ్మ రాత ఎలా ఉంటె అలా జరుగుతుంది", "ఆయన ఇచ్చిన ఆయుష్హు ఉన్నంత వరకు బతుకుతూనే ఉంటాం" అని అంటూ ఉండడం కనిపిస్తుంది. అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది.
    రావణాసురుడు బ్రహ్మ దగ్గరి నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు, ఋషులు సహా సర్వలోకాల్ని బాదించసాగాడు. రాక్షసానందంతో ఆ అసురుడు పుష్పక విమానమెక్కి లోకాలన్నింటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశమార్గాన నారదముని ఎదురయ్యాడు. నారదుడికి నమస్కరించి రావణుడు కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు ఎంతో సంతోషించి రావణుడి ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు. దేవతలందరినీ జయించడమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అంతగా కష్టపడి అందరి మరణానికి కారకుడైన యమధర్మరాజును జయించినందువల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని, ఆ ప్రయత్నం చేసి చూడాలని చెప్పాడు. యమపురికి వెళ్ళే మార్గం చాల కష్టతరమైందని నారదుడు రావణుడిని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. రావణుడు వెంటనే యమపురికి బయలుదేరాడు.
    ఇంతలో నారదుడు వెళ్లి యమధర్మరాజుకు రావణాసురుడు యుద్ధానికి వస్తున్నట్లు చెప్పాడు. నారదుడు అలా చెప్పుతున్నంతలోనే గొప్ప కాంతులతో విరాజిల్లుతున్న పుష్పక విమానమెక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు. ఎన్నో పాపాలు చేసి వాటికి తగిన ఫలితాన్ని అనుభవిస్తున్న ఎందరెందరినో రావణాసురుడు అక్కడ చూసాడు. భయంకరమైన రూపాలు కలిగిన యమకింకరులు అక్కడ ఉన్నారు. ఆ కింకరులు పెట్టె బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండడం కనిపించింది. కొంత మంది పురుగులకు, మరికొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకలు పెట్టడం కనిపించింది. మరికొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరణి నదిని దాటి కాలుతున్న ఇసుకలో దొర్లాడుతూ పెడబొబ్బలు పెడుతూ యాతనలు పడుతున్నారు. మరికొంతమంది పున్యత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూసాడు. గీత వాద్యాలను వింటూ కొంత మంది సంతోషిస్తున్నారు. గోదానం చేసిన వారు పాలను, అన్నదానం చేసిన వారు గృహవాస సుఖాన్ని అనుభవిస్తూ కనిపించారు. యమభటుల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపాత్ములు కొంత మందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు. పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవడంతో యమభటులకు కోపం వచ్చింది. వెంటనే ఆ భటులంతా రావణాసురుడినీ, అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్పక విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేసారు. బ్రహ్మ వరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్లీ మాములుగా ప్రత్యక్షమైంది. యమభటులు, రావనసేన ఘోరాతిఘోరంగా యుద్ధం చేయసాగారు. యమభటులు మంత్రులను విడిచిపెట్టి రావణాసురుడిపైకే శూలవర్శన్ని కురిపించారు. ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు, కవచం పడిపోయింది, కొద్ది క్షణాలు ఆగి మళ్లీ లేచి పాశుపతాస్త్రాన్ని సంధించాడు. యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు. వెంటనే రావణుడు అతడి మంత్రులు జయజయధ్వానాలు చేశారు.
    ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన వెంట మూడు లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యుదేవత బయలుదేరింది. యమధర్మరాజు కాలపాశంతోను, ముద్గురం లాంటి ఆయుధాలతోను రావణుడి మీద అగ్రహించి బయలుదేరాడు. అలా కోపంతో వస్తున్న యమధర్మరాజుని చూసి రావణాసురుడి మంత్రులంతా తలా ఒక దిక్కుకు భయంతో పరుగెత్తారు. యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్కచేయలేదు. అలాగే మొండిగా నిలుచున్నాడు. యముడు మరీ కోపంతో తన దగ్గరున్న శక్తి, తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు. ఆ ఆయుధాల దెబ్బలు తగిలినా రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. ఆ యుద్ధం చూడటానికి దేవతలు, గంధర్వులు, ఋషులు, బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు. రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యుదేవత పైకి నాలుగు బాణాలు, యముడి మీదకు అనేకానేక బాణాలను వదిలాడు. అందుకు కోపించిన యముడు ముక్కుపుటలనుంచి గొప్ప అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఆ అగ్ని రావణాసురుడిని దాహిస్తుందని మృత్యువు, యముడు అనుకున్నారు. అలా జరగక పోయేసరికి మృత్యువు యముడితో తనను రావణుడి మీదకు వదలాలని, వాడిని నాశనం చేసి వస్తానని పలికింది. యముడు తానే స్వయంగా రావణుడిని సంహరించాలని తన చేతిలో ఉన్న కాలదండాన్ని పైకెత్తాడు, శత్రువు మీదకి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాశం, ముద్గరం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి.
    ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంత గజగజ వణికిపోయారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని యముడిని వారించాడు. కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించడం తప్పదని, అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్లుగా అవుతుంది కనుక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి నచ్చజెప్పాడు. బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. రావణాసుర చరితంలోని ఇలాంటి సన్నివేశాలు, ఆ రాక్షసుడు బ్రహ్మ వళ్ళ వరం పొంది దేవతలను ఎంతగా ఇబ్బంది పెట్టాడో విశదం అవుతుంది. ఇలాంటి అనేకానేక కారణాలు రామావతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి.

No comments:

Post a Comment