సాక్షాత్తు శివున్నే ధరించినవాడు ఎవ్వడు? శివుడు గజ చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు? అనే విషయాలను ఈ కథ సందర్భం తెలియచేస్తుంది. పూర్వం కుమారస్వామితో తారకాసుర వధ జరిగిన తరువాత లోకాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి. తరువాత అదే తారకాసుర వంశంలో జనించిన వాడే గజాసురుడు. ఇతడు బ్రహ్మ ద్వారా వరాలు పొంది మూడులోకాలను జయించి వాటిని పాలించసాగాడు. ఇది దేవతలకు ఇబ్బందిగా పరిణమించింది. అంతేకాక గజాసురుడు గొప్ప శివభక్తుడు. ఇతడు నిత్యం శివారాధన చేసేవాడు.
ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు గజాసురుడి కొలువుకి వచ్చి గజాసురుడి మర్యాదకు ప్రసన్నుడై, నిరంతర శివభక్తి కలిగిన నీవు స్వయం శివున్నే నీ హృదయాన ప్రతిష్టించుకో...అని సూచన చేసాడు. ఇది గొప్ప అదృష్టమని నారదుడు అనడంతో గజాసురుడు వెంటనే పరమేశ్వరుని గురించి గొప్ప తపమాచరించి శివున్ని ప్రసన్నం చేసుకొన్నాడు. అప్పుడు గజాసురుడు శివున్ని వినమ్రంగా నమస్కరిస్తూ, నివోకచోట నేనోకచోట ఉండడం భావ్యం కాదని నిరంతరం తన హృదయంలో ఉండిపొమ్మని కోరుకున్నాడు. భక్తవత్సలుడైన శివుడు అనుగ్రహించి లింగరూపాన్ని ధరించి గజాసురుడి హృదయంలోకి ప్రవేశించాడు.
రుద్రుడు లేక కైలాసం కల్లోలమైంది. రుద్రగణాలు, ప్రమథగణాలు వెతికి నీరసించిపోయాయి. తిరిగి చేసేది లేక పార్వతిదేవి విష్ణువుని ఆశ్రయించింది. విష్ణువు పార్వతికి అభయమిచ్చి,ఓదార్చి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడికే ఇంద్రాది దేవతలను రప్పించి, వారంతా ఒక గంగిరెద్దుల ఆట ఆడించే వారిలా మారు వేషాలు ధరించి గజాసురుడు ఉండే షోణితపురానికి వెళ్ళారు. ఆ ఆటలో నందీశ్వరుడు గంగిరెద్దుగా, బ్రహ్మ సన్నాయిని వాయించే వాడుగా, ఇంద్రుడు జేగంట కొట్టే వాడుగా, భ్రుంగి వీరణాలు వాయించే వాడుగా వీధుల్లో తిరుగుతూ గజాసురుడి మందిరానికి చేరుకున్నారు. వారు పాడే శివభక్తి గీతాలకు గజాసురుడు ప్రసన్నుడై వారిని పిలిపించి గేయాలను పాడించుకున్నాడు.
ఆ గేయాలను వింటున్న పరమశివుడు ఆనందిస్తూ, గంగిరెద్దు నాట్యం చూస్తూ తన రూపాన్ని పెంచాసాగాడు. ఇది గమనించిన గజాసురుడు తనకు మరణం తప్పదని భావించి శివున్ని శరణువేడాడు. అప్పుడు శివుడు గజసురుదితో, నీ మరణం ఆసన్నమైనదని ఇంకేదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు గజాసురుడు తన శిరస్సు పూజార్హత కలిగి ఉండేలా, తన చర్మం శివుడు ధరించేలాగా, జన్మరాహిత్యం కలిగేల వరం ప్రసాదించమని వేడుకొన్నాడు. శివుడు ఆ కోరికను మన్నించి త్రిశులదారియై గజాసురుడి పొట్టను చిల్చుకొని బయటికి వచ్చాడు. తరువాత గజాసురుడి తలను భద్రపరిచారు. గజాసురుడి చర్మాన్ని ధరించి శివుడు గజచర్మాంబరదారిగా ప్రసిద్దికెక్కాడు. గజాసుర సంహారంతో దేవతలంతా సంతోషించారు.
No comments:
Post a Comment