Monday, 13 June 2011

ద్వాదశాదిత్యుల విశేషాలు

సూర్యుడు ఒక్కడే కాడని, తానే శివునిగా విష్ణువుగా బ్రహ్మగా ఇంకా పన్నెండు భాగాలుగా విడిపోయి పన్నెండు ప్రధాన కార్యాలను నిర్వర్తిస్తున్నాడని భవిష్యపురాణం డెబ్భై నాలుగో అధ్యాయంలో సూర్యద్వాదశమూర్తి వర్ణనం అనే కథలో కనిపిస్తుంది.
    సూర్యుడు మొదట చంద్రభాగనది తీరంలో తపస్సు చేసాడు. అప్పుడు ఆయన పేరు మిత్ర.. ఇక్కడే శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్యుడి మూర్తిని ప్రతిష్టించాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి తొలిగా బ్రహ్మదేవుడు, వక్షస్థలం నుంచి శ్రీమహావిష్ణువు, నుదురుభాగం నుంచి శివుడు, పాదాలనుంచి ఇతర దేవత గణాలన్నీ  ఆవిర్భవించాయి.  సూర్యుడు పన్నెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, పూష, త్వష్ట, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు, అనే పన్నెండు రూపాలుగా ఏర్పడ్డాడు. మొదటిదైన ఇంద్రమూర్తి దేవరాజ పదవిని అలంకరించి ఉంటుంది. ధాత ప్రజాపతిత్వాన్ని వహించి ప్రాణి సృష్టి చేస్తుంది.
    పర్జన్యుడు సూర్యకిరణాలలో ఉండి అమృతాన్ని వర్షిస్తుంది. పూషుడు మంత్రాలలో ఉండి ప్రజలను పోషిస్తుంటాడు. త్వష్ట వనస్పతులలోను, ఔషదాలలోను ఉంటుంది. ఆర్యముడు ప్రజలను ఆవరించి ఉంటాడు. భగుడు భూమి మీద ఉండే పర్వతాలలో ఉంటాడు. వివస్వంతుడు అగ్నిరూపంలో ఉండి ఆహారాన్ని వండుకోవటంలో సహకరిస్తూ ఉంటాడు. అంశుమంతుడు చంద్రుడిలో ఉంటూ ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణువు రాక్షససంహారం చేస్తూ ఉంటుంది. వరుణుడు జలనిధిలో నివసిస్తూ జగత్తుకు జలాన్నిస్తూ ఉంటాడు. మిత్ర లోకహితం కోసం చంద్రభాగానది తీరంలో ఉంటుంది. భక్తులను అనుగ్రహిస్తూ వరాలివ్వడమే మిత్రదేవుడి లక్ష్యం. అందుకే ఆ ప్రదేశానికి మిత్రపదం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడు లోక సంరక్షనార్థం ఇలా వివిధ రూపాలుగా విడిపోయాడు. ఇతర ఏ దేవతలు కనిపించకపోయినా కర్మసాక్షి అయిన సూర్యుడు మాత్రం నిరంతరం కనిపిస్తూనే ఉంటాడు. అణువణువునా ఆయన రూపమే ఇమిడి ఉందని ఆయనను భక్తి ప్రపత్తులతో పూజించడం మేలని భవిష్యపురాణం వివరిస్తుంది.

No comments:

Post a Comment