భారతీయ పురాణాలు, వేదాలు ఇంకా రుషులు వాస్తుశాస్త్రంపై అనేక శోదనలు చేసి ప్రజలకు అందించారు. ప్రస్తుత కాలంలో వాస్తుశాస్త్రంపై చాలా పరిశోధనలు కూడా జరుగుతూ వున్నాయి. మనిషి నిత్యం నివాసం ఉండే చోటు యొక్క ప్రభావం కుడా మనిషిపై ఉంటుందనేది సత్యము. నేటి కాలంలో అవసరానికి అనుగుణంగా తరచూ ఇళ్ళు మారడం అలవాటైపోయింది, అయిన సరే ప్రతి ఇంటి ప్రత్యేకత ఆ ఇంటి వాస్తు అమరికను బట్టి మారుతుంది. ఈ విషయం నిత్యం ఇళ్ళు మారుస్తూ ఉండేవారిని అడిగితే తెలుస్తుంది.
వివిధ వాస్తు సిద్ధాంతాలు, ప్రదిపాదనలు అనేకం నేడు అందుబాటులో ఉన్నాయి. కొందరు మత్స్యపురాణాన్ని అనుసరించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టితె, కొందరు వాస్తు పండితుణ్ణి సంప్రదించి ఇల్లు కట్టుకుంటారు. మొత్తానికి వాస్తుతో కూడుకున్న ఇళ్ళకి మార్కెట్లో కూడా చాలా విలువ వచ్చేసింది.
ఎనిమిది దిక్కులు వాటి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
1. తూర్పు - ఈ దిశ సూర్యున్ని సూచిస్తుంది. శుభకరమైనది. ఎక్కువ బరువును తట్టుకోలేదు, ఈ దిశగా నీటి ప్రవాహం శుభసూచకం.
2. ఉత్తరం - ఈ దిశ బృహస్పతిని సూచిస్తుంది. శుభకరమైనది. ఎక్కువ బరువును తట్టుకోలేదు, ఈ దిశగా నీటి ప్రవాహం శుభసూచకం.
3. పశ్చిమం - ఈ దిశ శనిని సూచిస్తుంది. ఎక్కువ బరువును తట్టుకోగలదు, ఈ దిశగా నీటి ప్రవాహం అశుభసూచకం.
4. దక్షిణం - ఈ దిశ కుజున్ని సూచిస్తుంది. ఎక్కువ బరువును తట్టుకోగలదు, ఈ దిశగా నీటి ప్రవాహం అశుభసూచకం.
5. ఈశాన్యం - ఇది తూర్పు, ఉత్తర దిశల మధ్య ఏర్పడే మూల. అత్యంత శుభకరమయినది. బరువును తట్టుకోలేదు. ఈ దిశ బుదున్ని సూచిస్తుంది.
6. వాయువ్యం - ఇది ఉత్తర, పశ్చిమ దిశల మధ్య ఏర్పడే మూల. కొంత బరువును తట్టుకోగలదు. ఈ దిశ కేతువుని సూచిస్తుంది.
7. నైరుతి - ఇది పశ్చిమ, దక్షిణ దిశల మధ్య ఏర్పడే మూల. బరువు ఎంతైనా తట్టుకోగలదు. ఈ దిశ రాహువుని సూచిస్తుంది.
8. ఆగ్నేయం - ఇది దక్షిణ, తూర్పు దిశల మధ్య ఏర్పడే మూల. కొంత బరువును తట్టుకోగలదు. ఈ దిశ చంద్రుడిని సూచిస్తుంది.