Sunday, 29 May 2011

శివుడు చెప్పినట్లు చేద్దాం

శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంతటి ఆ లయకరకుడు మానవాళికి పుణ్యసంపాదన కొన్ని కొన్ని సులభ మార్గాలని ఉద్దేశించాడు. ఈ విషయాలన్నీ మహాభారతం అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఒక రోజు పార్వతిదేవి పరమేశ్వరుడిని మానవులు ఏం చేస్తే సులభంగా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చో చెప్పమని అడిగినప్పుడు శివుడు స్వయంగా ఆమెకు ఇలా వివరించాడు.
    ప్రాణాన్ని కలిగి ఉన్న ప్రతి జీవికి నీరు ఎంతో అవసరం. అలాంటి జలాన్ని దానం చేయడం ద్వార స్వర్గ సుఖం కలుగుతుంది. బంగారాన్ని దానం చేస్తే దాతకు పవిత్రత చేకూరుతుంది. గోవు ప్రత్యక్ష దైవమె. అలాంటి గోవును జ్ఞానవంతుడికి దానంమిస్తే ఆ గోవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలపాటు దాతకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందులో కపిల గోవుదానం ఇంకా ప్రశస్తమైనది. భూమిని దానం చేసిన వారికి భూమి ఉన్నంతకాలం స్వర్గసౌఖ్యం కలుగుతుంది. భూమి నుంచి అనేకానేక వస్తువులు ఉద్భావిస్తుంటాయి. కనుక భూమిని దానం చేసిన వారికి ఆయా వస్తువులు దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. భూదానం వల్ల ఎన్నెన్నో పాపాలు తొలగిపోతాయి. దానాలలో కన్యాదానంవల్ల దేవతలంతా సంతోషిస్తారు. కన్యదాతకు తేజం, సంపద, కీర్తి కలుగుతాయి.
    విద్యను మంచి శిష్యుడికి దానం చేస్తే దానివల్ల గురువుకు తరిగిపోని ఆనందం కలుగుతుంది. తగిన ధనమిచ్చి పేదలకు విద్యను చెప్పించటం వల్ల విద్యాదాన ఫలం లభిస్తుంది. నువ్వుల రాశిని దానమిస్తే అగ్నిష్టోమయజ్ఞం చేసినంత ఫలం, వస్త్రాలను దానమిస్తే దీర్ఘాయువు, గోడుగుని ఇస్తే బాధలనుంచి విముక్తి, దాసదాసిజనులను దానమిస్తే కర్మ విముక్తి, దీపదానం వల్ల నిర్మలాత్మత. ప్రవాహాన్ని, నదిని దాటడానికి ఎవరికైనా సహయంచేస్తే వ్యసనాల వల్ల కలిగిన పాపాలు తోలగేలాంటి పుణ్యం లభిస్తుంది. అందరూ నడిచే దోవను శుభ్రం చేస్తే సంతానప్రాప్తి, ఔషదాల దానం వల్ల రోగ బాధల నివృత్తి, బాటసారికి ఆశ్రయం ఇచ్చినందువల్ల శరీర సౌఖ్యం కలుగుతాయి.
    యజ్ఞాలు వైదికమని, లౌకికమని రెండు విధాలుగా ఉన్నాయి. రుత్విక్కులకు తృప్తి కలిగేల చేసేది వైదిక యజ్ఞం. దేవతలకు మహోత్సవాలు చేయడం, భజనలు నృత్యాలను ఏర్పాటు చేయడం, గంధం పూలమాలలు దుపదీపాలు నైవేద్యాలు భక్తితో నివేదించటం లౌకిక యజ్ఞం. ఈ రెండు హితమైనవే. చక్కగా శాస్త్రవిధిగా చేసిన యజ్ఞానికి దాన, ధర్మాలు సాటిరావు. దేవతలు మానవుల మనసులను గమనిస్తూవుంటారు కనుక చిత్తశుద్దితో యజ్ఞాలైనా, దానాలైనా చేయాల్సి ఉంటుంది. పితృకార్యాలు చేయడం వల్ల కూడా గొప్పపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ కార్యాలు చేసేటప్పుడు ఏమరుపాటు లేకుండా ఉండటం ముఖ్యం. సత్ప్రవర్తన కలిగిన వారిని అర్చించి పితృకార్యం చేసే రోజున భోజనం పెట్టి, వస్త్రాలను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల సర్వత్ర శుభం కలుగుతుందని పార్వతికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు.

Tuesday, 24 May 2011

ఉత్తమలక్షణం క్షమ

మనిషికి క్షమాగుణం ఎంతగా ఉపయోగపడుతుందో, జటిలమైన సమస్యలు దీని ద్వారా ఎంత సులభంగా పరిష్కరించబడతాయో కొన్ని పురాణ పరమైన కథలు తెలియజేస్తాయి. ఆ కోవకు చెందిన ఒక కథ రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడి పూర్వచరిత్రకు సంబంధించి ఉంది.
    పూర్వం కుశుడు అనే గొప్ప తపోధనుడు ఉండేవాడు అతడు ఎంతో ధర్మాత్ముడు. ఈయనకు విదర్భ రాజు కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు కలిగారు. వీరిలో కుశనాభుడు ఒకడు. ఇతను మహొదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతు ఉండేవాడు. ఇతడు ఘ్రుతాచి అనే అప్సరసను వివాహమాడాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కలిగారు. వీరు తండ్రి ధర్మలక్షణాలు, తల్లి అందచందాలు కలగలిసి, గొప్ప జ్ఞానవంతులుగా పెరిగి పెద్దయ్యారు.
    ఒక రోజు ఈ రాకుమార్తెలు వన విహారానికి వెళ్లారు. అక్కడ వీరు ఆడుకొంటూ ఉండగా పెద్ద గాలి వీచి వాయుదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వాయుదేవుణ్ణి చూసి వినయ సంపన్నులైన రాకుమార్తెలు ఆయనకు నమస్కరించారు. వాయువు వారితో తాను ఆ ముగ్గురిని చూసి సమ్మోహితుడైనట్లు చెప్పి తనను వివాహమాడాలని కోరాడు. రాకుమార్తెలు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. వెంటనే వారు వాయువుతో తాము తండ్రి చాటు బిడ్డలమని, వివాహం విషయంలో తండ్రి అనుమతి లేనిదే తామేమి మాట్లాడబోమని అన్నారు.వాయుదేవుడు తనను పెళ్లాడితే నిత్య యౌవ్వనం లభిస్తుందని, కాదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయిన ఆ ముగ్గురు రాకుమార్తెలు తండ్రి మాటే తమదని కచ్చితంగా తెగేసి చెప్పారు. దాంతో వాయుదేవుడికి కోపం వచ్చి ఆ ముగ్గురిని అందవిహీనులై, గూని వారుగా మారిపొమ్మని శపించి వెళ్ళిపోయాడు. అయిన వారు బాధ పడలేదు, వారికి వాయుదేవుడిని శపించెంత శక్తి ఉన్న వారు ఆ పని చేయలేదు. తండ్రి దగ్గరికి వచ్చి విషయాన్నంతా వివరించారు. కుశనాభుడు తన కుమార్తెలకు తగిన వరుణ్ణి వెదికి బ్రహ్మదత్తుడనే గొప్ప తపోశక్తి కలిగిన రాజుకి ఇచ్చి వివాహం చేయించాడు. దాంతో వారికి శాపం తొలగిపోయి వారి నిజరూపాలు వచ్చాయి. కుశనాభుడు తర్వాత పుత్రకామేష్టి యాగం చేసి గాధి అనే కుమారున్ని పొందాడు. గాధికి విశ్వామిత్రుడు, సత్యవతి జన్మించారు. సత్యవతి విశ్వామిత్రుడి అక్క.
    ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది రాకుమార్తెల క్షమాగుణం. తమకు వాయుదేవుణ్ణి శపించెంత శక్తి ఉన్నప్పటికీ క్షమ గుణాన్ని ప్రదర్శించి ఓర్పు వహించారు. విషయం మరింత తీవ్రం అవ్వకుడదని వాయువు పై కోపాన్ని చూపక తమ తండ్రికి విషయాన్నీ తెలియజేసారు. కొద్దిగా ఆలోచిస్తే ఓర్పు, క్షమా అనే గుణాల్ని కలిగి ఉండటం మేలు అని తెలియజేస్తుంది ఈ కథ సందర్భం.

Saturday, 21 May 2011

పుణ్యదాయిని విష్ణుప్రియ తులసి

కార్తిక పురాణం తులసి మహిమను వివరిస్తుంది. జలంధరుడికి, పరమేశ్వరుడికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మదేవుడి సహాయంతో ఈశ్వరుడు తన చక్రాయుధంతో జలంధరుడిని చేదించాడు. ఆ జలంధరుడి నుండి వెలువడిన కాంతి ఈశ్వరుడిలో కలిసిపోయింది. రాక్షసుడి మరణంతో దేవతలంతా ఆనందించారు. అప్పుడే దేవతలకు మరొక సమస్య ఎదురయింది. బృంద మోహంలో ఉన్న విష్ణువు ఆమె ఆహుతి అయిన ప్రదేశంలో సంచరించసాగాడు. అప్పుడు దేవతలంతా ఆ మహామాయను శరణువేడారు. ఆమె సంతసించి విష్ణువు మొహం నుంచి తేరుకోవడానికి తాను సరస్వతి, లక్ష్మి, పార్వతుల అంశాలు నిండిన కొన్ని బీజాలను దేవతలకిస్తున్నట్లు, వాటిని తీసుకెళ్ళి బృంద ఆహుతై విష్ణువు తిరుగుతున్న ప్రాంతంలో చల్లమని చెప్పింది. దేవతలు అల చేయగానే అక్కడ ఉసిరి, తులసి, మాలతి అనే మొక్కలు ఆవిర్భవించాయి. సరస్వతి అంశతో ఉసిరి, లక్ష్మి అంశతో మాలతి, పార్వతి అంశతో తులసి ఆవిర్భవించాయి.
    ఈ మూడింటిని విష్ణువు తిలకించసాగాడు. ఇందులో లక్ష్మి అంశతో ఉన్న మాలతి ఈర్ష్య స్వరుపినిగా కనిపించి విష్ణువుకు దూరమయింది. తులసి, ఉసిరి మాత్రం ఇసుమంతైన అసూయ లేకుండా అనురాగపురితంగా ఉండడంతో విష్ణువు మనస్సును ఆకర్షించాయి. అప్పుడు విష్ణువు మొహం తొలగిపోయి తులసి, ఉసిరి సమేతంగా దర్శనమిచ్చాడు.
    తులసి వనం ఉన్నచోట పుణ్యతీర్థం ఉన్నట్లే లెక్క. సర్వపాపాలను నశింపచేస్తుంది. తులసి సేవనం గంగాస్నానం, నర్మదా దర్శనంతో సమానం. ఈ మొక్కను నాటిన, తాకిన, పెంచినా సర్వపాపాలు హరిస్తాయి. ద్వాదశి నాడు మాత్రం ఎవరూ తులసిదళాలను కోయకూడదు. ఉసిరి చెట్టు కూడా అత్యంత పవిత్రమయినదని కార్తిక పురాణం పేర్కొంటోంది. ఉసిరి కాయలను తాకిన, పాత్రలతో కాని, కాయలతో కాని దేవతపూజ చేసినా అత్యంత పుణ్యదాయకమవుతుంది. సమస్త దేవతలు కార్తిక మాసంలో ఉసిరిచెట్టుని ఆశ్రయించి ఉంటారు. ఈ చెట్టు నీడన కార్తికంలో భోజనంచేస్తే సంవత్సర పాపదోషం నశిస్తుంది. ఈ చెట్టు నీడన విష్ణుపూజ పుణ్యదాయకం. ఇలా ఉసిరి, తులసి మహాత్మ్యాన్ని కార్తీకపురాణం పేర్కొంటోంది. నేటి కాలంలో కూడా తులసి, ఉసిరి గుణాలను ఎన్నింటినో మనం గుర్తిస్తూనే ఉన్నాం.

Sunday, 15 May 2011

పురాణాలలో ధ్యానం

ధ్యానం గురించి పురాణాలలో చాల చోట్లలో ప్రస్తవితమైవుంది. ధ్యాన యోగాన్ని అవలంబించేవారు మనసులో ఎవరిని ధ్యానించాలి? ఎలా ధ్యానించాలి? ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను వ్యాస భాగవతంలోని రెండో అధ్యాయంలో ఉన్న ఈ ఒక కథ సందర్భం వివరిస్తుంది.
    యోగి ఒక విషయాన్నీ గమనించాలి. అదేమంటే ఆ అనంత స్వరూపుడైన ఆ పరంధాముడు మనిషి చిత్తంలోనే ఉన్నాడు. దీనినే ఆత్మ అని అంటారు. ఇది అసత్యం కాదు, దీనికి అసలు నాశనం లేదు. దీనినే ధ్యానాన్ని అవలంబించే యోగులు తమ మనసులో ధ్యానించాలి. అప్పుడే అవిద్య అంతరించిపోతుంది. ఇలా కాక మరో పద్ధతిలో కూడా ధ్యనించవచ్చు. ధ్యానించేవాడు తన చిత్తంలోని భగవంతుడిని గుర్తించి ధ్యానించలేనప్పుడు ఆ భగవంతుడి స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానించవచ్చు. ఆయన స్వరూపం ఒక క్రమపద్ధతిలో ఇలా ఉంటుంది.
    ఆ స్వామి శంఖ, చక్ర, గదా పద్మాలతో నాలుగు చేతులతో ఉంటాడు. పద్మపత్రాల్లాంటి కళ్ళుంటాయి. కదంబ కేసరాల్లాగా పచ్చని రంగులో ఉండే పట్టు వస్త్రాలను ధరించి ఉంటాడు. రత్నాలు చెక్కిన బంగారు కడియాలు చేతులకు, ఉజ్వలమైన మణులతో ధగధగలాడే కిరీటాన్ని ధరించి ఉంటాడు. చెవులు రత్నకుండలాలతో మెరిసిపోతుంటాడు. హృదయం మీద శ్రీవత్స చిహ్నం, కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉంటాయి. అన్నిటికి మించి వెలుగొందే వనమాలను ధరించి ఉంటాడు. అలాంటి ఆ నారాయణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని ధ్యానించాలి యోగులు. నడుముకు రత్నాల మొలతాడు, వేళ్ళకు బంగారు ఉంగరాలు, కాళ్ళకు మూపురాలు, చేతులకు కంకణాలు ధ్యానించే వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్వామి నుదిటి మీద ఉంగరాలు తిరిగిన నల్లటి ముంగురులు కదలాడుతూ కనిపిస్తాయి. చిరునవ్వుతో కళకళలాడే ఆ స్వామి ముఖం, నవ్వుతు నాట్యమాడే కనుబొమ్మలతో నిరంతరం అనుగ్రహ వీక్షణాలతో ఉండే ఆ స్వామి ధ్యానించే వారికి ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాడు. యోగి ఇలాంటి దివ్యముర్తిని తన మదిలో ధారణ నిలిచినంతసేపు ధ్యానం చేస్తూ ఉండాలి.
    ఆయన పాదాలు మొదలుకొని ముఖం వరకు ప్రతి అంగాన్ని ధారణ పూర్వకంగా ధ్యానించాలి. మనస్సును ఆయన మీద తప్ప మరెక్కడా నిలపకూడదు. బుద్ధిని నిశ్చలంగా, పవిత్రంగా ఉండేలా చూడాలి. ఇతర విషయాలపై మనసును పోనివ్వకుండా ఏకాగ్ర చిత్తంతో స్వామిని ధ్యానించాలి. ముందుగా సుఖాసనం మీద కూర్చొని ప్రాణయామం చేయాలి. అలా ప్రాణవాయువుని నిరోధిస్తు ఇంద్రియాలను గెలవటం అలవాటు చేసుకోవాలి. నిర్మల బుద్ధితో మనసుని స్థిరపరచి తిరిగి బుద్ధిని ఆత్మతో స్థిరపరచాలి. ఇలా ఆత్మను అంతరాత్మలో లీనం చేయాలి. అంతరాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి శాంతిమయ స్థితిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ స్థితిలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఏదీ ఉండదు. అహంకారం, మహత్తత్వం, ప్రకృతి లాంటివేమీ ఉండవు. యోగి ఈ స్థితికి చేరుకోవాలి. ఈ స్థితి ఉత్తమోత్తమ స్థితి. అతడు అవిద్య నుంచి విముక్తుడవుతాడు.

Tuesday, 10 May 2011

అదితి ఆదర్శ అమ్మతనం


అధర్మం లోకంలో రాజ్యమేలుతున్నప్పుడు అమ్మలంతా ఏం చేయాలి ఎలా ఉండాలి అనే విషయాల్ని మత్స్య మహాపురణంలోని వామన చరితంలోని ఒక కథ సందర్భం వివరిస్తుంది. పూర్వం దైత్యులు దేవతల మీదకి దండెత్తి వారిని రాజ్యహీనులను చేసి సాధుజనులను, సత్పురుషులను, ఇతర ధర్మాత్ములను హింసిస్తూ వారికి భూమిపై చోటు లేకుండా చేసి అధర్మం ధర్మం లాగ చెలామణి అయ్యెలా చేయసాగారు. ఎవరైనా మంచివారు ఎదురుతిరిగితే వారికి అపజయమే ఎదురయ్యేది. ఇదంతా కశ్యపుడి భార్య అయిన అదితికి ఎంతో బాధ కలిగించింది.
    దీనిని ఎవరు అణచలేర? అని ఆమె చాలా ఆలోచించింది. ఎవరో అణచాలని తను ఎదురుచూడటం ఎందుకు నేనే ఒక ప్రయత్నం చేయవచ్చుకదా అని ఆ అణచగల ధీరుడు తనకు కుమారుడుగా కావాలని అనుకొంది. వెంటనే ఆ శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని తన కోరిక విన్నవించుకోంది. ఈ సమాజంలో అధర్మం రాజ్యమేలుతుందని, తనకు కొడుకుగా శ్రీహరియే ఉదయించి జరుగుతున్న ఇదంతా అణచివేయాలని వరమడిగింది. ధర్మానికి హాని కలిగినప్పుడు తానవతరించి ఆ ధర్మాన్ని కాపాడడమే శ్రీహరి లక్ష్యం కనుక ఆమెకు జన్మిస్తానని వరమిచ్చాడు.
    శ్రీమహావిష్ణువు వరంతో ఆమె గర్భందాల్చింది. ఒక శుభ ముహూర్తాన వామనావతారుడైన శ్రీహరి జన్మిస్తాడు. ఆ క్షణాన దేవతలంతా ఆ దేవదేవుడిని స్తుతించారు. దైత్యులకు అపశకునాలు ఎదురయ్యాయి. సజ్జనుల మనసులు పులకించి పోయాయి. ఆ చిన్నారి వామనుడికి బ్రహ్మదేవుడు కృష్ణాజినాన్ని, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, మరీచి ఆషాడదండాన్ని, వసిష్టుడు కమండలాన్ని, అంగిరుడు దర్భలను, పులహుడు రుద్రాక్ష దండను, పులస్త్యుడు తెల్లని వస్త్రాలను బహూకరించారు. ఆ వెంటనే వేదాలు అనేక శాస్త్రాలు లాంటివన్నీ వచ్చి ఆ స్వామిని ఆశ్రయించాయి. ఇక వామనుడు వీటన్నింటిని ధరించి ధర్మసంస్థాపన కోసం అడుగులు వేశాడు.
    ఈ కథ సందర్భంలో చక్కటి సందేశం ఉంది. సమాజంలో అన్యాయం పెరుగుతున్నప్పుడు, అధర్మం నడుస్తున్నప్పుడు కాలం వృధా చేయకుండా ఎవరికీ వారు తమ స్థాయిలో తగిన ప్రయత్నం చేయాలని, తల్లులు తమ బిడ్డలు అధర్మాన్ని జయించి, ధర్మాన్ని నిలబెట్టగలిగిన వారుగా ఉండాలనే దీక్షతో బిడ్డలను కని పెంచాలని, ఇలా ధర్మాన్ని కాపాడాలని చెబుతుంది.

Thursday, 5 May 2011

ముచుకుంద వరదుడు

 ఇది భాగవతంలోనిది. పూర్వం సూర్యవంశంలో మాంధాత చక్రవర్తి ఉండేవాడు. ఈయన కుమారుడే ముచుకుందుడు. ముచుకుందుడు మంచి పేరు తెచ్చుకొని రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ సమయంలో దేవదానవ యుద్దంలో దేవతల పక్షాన నిలిచి నాయకత్వం వహించే వారు లేకపోయారు. అప్పుడు దేవతలు ఈ భాద్యత ముచుకుందుడికి అప్పగించారు, ముచుకుందుడు కూడా చాలాకాలం పాటు యుద్ధం చేసి దేవతలకు విజయం కలిగించి ఆనందపరిచాడు.
    అప్పుడు దేవేంద్రుడు ముచుకుందుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. తను అలసిపోయానని హాయిగా నిద్ర పట్టే వరం ఇవ్వమని మధ్యలో ఎవరైనా తనకు నిద్రాభంగం కలిగిస్తే తన చూపు సోకి భస్మమై పోయేలా వరం కావాలన్నాడు. దేవతలు ఆ వరం ప్రసాదించారు. తరువాత అయన మధురకు సమీపంలో ఉన్న ఒక కొండగుహలో నిద్రకు ఉపక్రమించాడు. ఇలా చాల కాలం గడిచింది, ద్వాపర యుగం వచ్చింది.
    ఆ కాలంలో కాలయవనుడు అనే రాక్షసుడు లోకలన్నిటికి కంటకుడిగా మారాడు. రాజులందరిని ఓడిస్తూ ఉండేవాడు. ఓ రోజు నారదుడు ఎదురై ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడిని జయించమని సలహా ఇస్తాడు. ఆ మాటలను విన్న రాక్షసుడు శ్రికృష్ణుడి మీదకు దండెత్తుతాడు. అప్పుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శిస్తాడు. శత్రువు దొరకలేదని ఉక్రోషంగా ఉన్న రాక్షసుడికి శ్రీకృష్ణుడు నిరాయుధుడై పారిపోతున్నట్లు కనిపించి, ధర్మాన్ని కాపాడటానికి వైష్ణవ మాయను ప్రదర్శించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహవైపు వెళ్లి లోపల దాగాడు. శ్రీకృష్ణుడిని అనుసరిస్తూ వచ్చిన ఆ రాక్షసుడు అక్కడ పడుకున్న ముచుకుందుడే శ్రిక్రుష్ణుడని భ్రమించి ఆయన్ని కాలితో తన్నాడు. నిద్రాభంగమైన ఆ ముచుకుందుడి చూపు సోకి ఆ రాక్షసుడు భస్మమై పోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముచుకుందుడికి దర్శనం ఇచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తనకు నిత్యం భగవంతుడిని ఉపాసించే వరం కోరి పొందుతాడు. దైవం ముచుకుందుడి లాంటి వారిని దుష్ట సంహారం గురించి ఒక సాధనంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ధర్మసుక్ష్మాన్ని అనుసరించి జరిగింది.

Sunday, 1 May 2011

హితులు సన్మార్గదర్శకులు

విశ్వామిత్రుడు అనగానే కోపానికి ప్రతీకగా కొందరు భావిస్తుంటారు. కానీ ఆ మహార్శిలో ఇంకా ఎన్నెన్నో ఆదర్శ గుణాలు ఉన్నాయి. ఆయన హితైషి. ఆయన గురించి స్వయంగా విశిష్ట మహర్షి తెలియజెప్పిన కథ సందర్భం ఒకటి రామాయణ బాలకాండ ఇరవై ఒకటో సర్గలో కనిపిస్తుంది.
    దశరథుడు మహారాజు విశ్వామిత్రుడికిచ్చిన మాట ప్రకారం తన పుత్రులను పంపడం ఇష్టం లేదని వారు పెళ్లి కావలసినవరైనప్పటికి ఇంకా పసివారని, రాక్షస సంహారం చేయలేరని విశ్వామిత్రుడికి చెప్పాడు. దశరథుడు ఇలా సందిగ్ధస్థితిలో ఉండడం చూసి విశ్వామిత్రుడికి దశరథుడిపైన కోపం వచ్చింది వెంటనే ఆయన దశరథుడిని హెచ్చరిస్తూ మాట తప్పడం నీ వంశానికే కలంకమని, నీవరితో నీవు సుఖంగా ఉండు అని కోపోద్రిక్తంగా అన్నాడు. అలా అంటూ ఉండగానే భూమండలం అంత కంపించింది. దేవతలు భయగ్రస్తులయ్యారు. ఇదంతా వశిష్ట మహర్షి చూసి దశరథుడికి సత్యమేదో తెలియచెప్పడానికి చేసిన ప్రయత్నం ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు మంచేదో, చెడేదో చెప్పే ప్రయత్నం చేయాలన్న ఆర్యోక్తిని ఇక్కడ ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది.
     వశిష్టుడు దశరథుడిని అనునయిస్తూ...ఆడిన మాట నిలబెడితే అశ్వమేధ యాగఫలం దక్కుతుంది, మాట తప్పితే పూర్వ పుణ్యఫలం నశిస్తుంది. విశ్వామిత్రుడు అసామాన్యుడు, అయన రక్షణలో రాముడు అగ్ని రక్షణలో ఉన్న అమృతంలా చక్కగా ఉంటాడు.కనుక నిస్సందేహంగా రామలక్ష్మణులను అయన వెంట పంపవచ్చు. మూడు లోకాల్లో ఆయనను మించినవాడు, అస్త్ర ప్రయోగాలూ తెలిసిన వాడు ఎవరు లేరు కనుక రాముడిని పంపాలి.ధర్మాత్ముడైన ఆ రుషి తానే స్వయంగా రాక్షసులను నిగ్రహించగల సమర్థుడే కాని రామలక్ష్మణులకు మేలు చేయడానికే నిన్ను ఇలా అభ్యర్తిస్తున్నాడు అని వశిష్టుడు దశరథుడికి విశ్వామిత్రుడి విశిష్టత గురించి చక్కగా వివరించి చెప్పాడు. అప్పటి వరకు స్వార్థంతో, ప్రేమతో నిండిన ఆ రాజు మనస్సు మారి ఒప్పుకున్నాడు.
    సందిగ్ధ అవస్తలో ఉన్న వ్యక్తికి చక్కటి ఉపాయం చెప్పే హితుడికి ప్రతిరూపంగా వశిష్టుడు ఈ ఘట్టంలో కనిపిస్తాడు. వశిష్టుడి మాటలు విన్న తరువాతే రామలక్ష్మణులను విశ్వామిత్రుడివెంట పంపడానికి దశరథుడు అంగీకరించాడు.ఈ కథ సందర్భం విశ్వామిత్రుడి విశిష్టత గురించి, ప్రతి మనిషి జీవితంలో హితుల పాత్ర ఏ మేరకు ఉంటుందో సూచనప్రాయంగా తెలియజేస్తుంది.