అధర్మం లోకంలో రాజ్యమేలుతున్నప్పుడు అమ్మలంతా ఏం చేయాలి ఎలా ఉండాలి అనే విషయాల్ని మత్స్య మహాపురణంలోని వామన చరితంలోని ఒక కథ సందర్భం వివరిస్తుంది. పూర్వం దైత్యులు దేవతల మీదకి దండెత్తి వారిని రాజ్యహీనులను చేసి సాధుజనులను, సత్పురుషులను, ఇతర ధర్మాత్ములను హింసిస్తూ వారికి భూమిపై చోటు లేకుండా చేసి అధర్మం ధర్మం లాగ చెలామణి అయ్యెలా చేయసాగారు. ఎవరైనా మంచివారు ఎదురుతిరిగితే వారికి అపజయమే ఎదురయ్యేది. ఇదంతా కశ్యపుడి భార్య అయిన అదితికి ఎంతో బాధ కలిగించింది.
దీనిని ఎవరు అణచలేర? అని ఆమె చాలా ఆలోచించింది. ఎవరో అణచాలని తను ఎదురుచూడటం ఎందుకు నేనే ఒక ప్రయత్నం చేయవచ్చుకదా అని ఆ అణచగల ధీరుడు తనకు కుమారుడుగా కావాలని అనుకొంది. వెంటనే ఆ శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని తన కోరిక విన్నవించుకోంది. ఈ సమాజంలో అధర్మం రాజ్యమేలుతుందని, తనకు కొడుకుగా శ్రీహరియే ఉదయించి జరుగుతున్న ఇదంతా అణచివేయాలని వరమడిగింది. ధర్మానికి హాని కలిగినప్పుడు తానవతరించి ఆ ధర్మాన్ని కాపాడడమే శ్రీహరి లక్ష్యం కనుక ఆమెకు జన్మిస్తానని వరమిచ్చాడు.
శ్రీమహావిష్ణువు వరంతో ఆమె గర్భందాల్చింది. ఒక శుభ ముహూర్తాన వామనావతారుడైన శ్రీహరి జన్మిస్తాడు. ఆ క్షణాన దేవతలంతా ఆ దేవదేవుడిని స్తుతించారు. దైత్యులకు అపశకునాలు ఎదురయ్యాయి. సజ్జనుల మనసులు పులకించి పోయాయి. ఆ చిన్నారి వామనుడికి బ్రహ్మదేవుడు కృష్ణాజినాన్ని, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, మరీచి ఆషాడదండాన్ని, వసిష్టుడు కమండలాన్ని, అంగిరుడు దర్భలను, పులహుడు రుద్రాక్ష దండను, పులస్త్యుడు తెల్లని వస్త్రాలను బహూకరించారు. ఆ వెంటనే వేదాలు అనేక శాస్త్రాలు లాంటివన్నీ వచ్చి ఆ స్వామిని ఆశ్రయించాయి. ఇక వామనుడు వీటన్నింటిని ధరించి ధర్మసంస్థాపన కోసం అడుగులు వేశాడు.
ఈ కథ సందర్భంలో చక్కటి సందేశం ఉంది. సమాజంలో అన్యాయం పెరుగుతున్నప్పుడు, అధర్మం నడుస్తున్నప్పుడు కాలం వృధా చేయకుండా ఎవరికీ వారు తమ స్థాయిలో తగిన ప్రయత్నం చేయాలని, తల్లులు తమ బిడ్డలు అధర్మాన్ని జయించి, ధర్మాన్ని నిలబెట్టగలిగిన వారుగా ఉండాలనే దీక్షతో బిడ్డలను కని పెంచాలని, ఇలా ధర్మాన్ని కాపాడాలని చెబుతుంది.
No comments:
Post a Comment