ఇది భాగవతంలోనిది. పూర్వం సూర్యవంశంలో మాంధాత చక్రవర్తి ఉండేవాడు. ఈయన కుమారుడే ముచుకుందుడు. ముచుకుందుడు మంచి పేరు తెచ్చుకొని రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ సమయంలో దేవదానవ యుద్దంలో దేవతల పక్షాన నిలిచి నాయకత్వం వహించే వారు లేకపోయారు. అప్పుడు దేవతలు ఈ భాద్యత ముచుకుందుడికి అప్పగించారు, ముచుకుందుడు కూడా చాలాకాలం పాటు యుద్ధం చేసి దేవతలకు విజయం కలిగించి ఆనందపరిచాడు.
అప్పుడు దేవేంద్రుడు ముచుకుందుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. తను అలసిపోయానని హాయిగా నిద్ర పట్టే వరం ఇవ్వమని మధ్యలో ఎవరైనా తనకు నిద్రాభంగం కలిగిస్తే తన చూపు సోకి భస్మమై పోయేలా వరం కావాలన్నాడు. దేవతలు ఆ వరం ప్రసాదించారు. తరువాత అయన మధురకు సమీపంలో ఉన్న ఒక కొండగుహలో నిద్రకు ఉపక్రమించాడు. ఇలా చాల కాలం గడిచింది, ద్వాపర యుగం వచ్చింది.
ఆ కాలంలో కాలయవనుడు అనే రాక్షసుడు లోకలన్నిటికి కంటకుడిగా మారాడు. రాజులందరిని ఓడిస్తూ ఉండేవాడు. ఓ రోజు నారదుడు ఎదురై ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడిని జయించమని సలహా ఇస్తాడు. ఆ మాటలను విన్న రాక్షసుడు శ్రికృష్ణుడి మీదకు దండెత్తుతాడు. అప్పుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శిస్తాడు. శత్రువు దొరకలేదని ఉక్రోషంగా ఉన్న రాక్షసుడికి శ్రీకృష్ణుడు నిరాయుధుడై పారిపోతున్నట్లు కనిపించి, ధర్మాన్ని కాపాడటానికి వైష్ణవ మాయను ప్రదర్శించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహవైపు వెళ్లి లోపల దాగాడు. శ్రీకృష్ణుడిని అనుసరిస్తూ వచ్చిన ఆ రాక్షసుడు అక్కడ పడుకున్న ముచుకుందుడే శ్రిక్రుష్ణుడని భ్రమించి ఆయన్ని కాలితో తన్నాడు. నిద్రాభంగమైన ఆ ముచుకుందుడి చూపు సోకి ఆ రాక్షసుడు భస్మమై పోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముచుకుందుడికి దర్శనం ఇచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తనకు నిత్యం భగవంతుడిని ఉపాసించే వరం కోరి పొందుతాడు. దైవం ముచుకుందుడి లాంటి వారిని దుష్ట సంహారం గురించి ఒక సాధనంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ధర్మసుక్ష్మాన్ని అనుసరించి జరిగింది.
No comments:
Post a Comment