కార్తిక పురాణం తులసి మహిమను వివరిస్తుంది. జలంధరుడికి, పరమేశ్వరుడికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మదేవుడి సహాయంతో ఈశ్వరుడు తన చక్రాయుధంతో జలంధరుడిని చేదించాడు. ఆ జలంధరుడి నుండి వెలువడిన కాంతి ఈశ్వరుడిలో కలిసిపోయింది. రాక్షసుడి మరణంతో దేవతలంతా ఆనందించారు. అప్పుడే దేవతలకు మరొక సమస్య ఎదురయింది. బృంద మోహంలో ఉన్న విష్ణువు ఆమె ఆహుతి అయిన ప్రదేశంలో సంచరించసాగాడు. అప్పుడు దేవతలంతా ఆ మహామాయను శరణువేడారు. ఆమె సంతసించి విష్ణువు మొహం నుంచి తేరుకోవడానికి తాను సరస్వతి, లక్ష్మి, పార్వతుల అంశాలు నిండిన కొన్ని బీజాలను దేవతలకిస్తున్నట్లు, వాటిని తీసుకెళ్ళి బృంద ఆహుతై విష్ణువు తిరుగుతున్న ప్రాంతంలో చల్లమని చెప్పింది. దేవతలు అల చేయగానే అక్కడ ఉసిరి, తులసి, మాలతి అనే మొక్కలు ఆవిర్భవించాయి. సరస్వతి అంశతో ఉసిరి, లక్ష్మి అంశతో మాలతి, పార్వతి అంశతో తులసి ఆవిర్భవించాయి.
ఈ మూడింటిని విష్ణువు తిలకించసాగాడు. ఇందులో లక్ష్మి అంశతో ఉన్న మాలతి ఈర్ష్య స్వరుపినిగా కనిపించి విష్ణువుకు దూరమయింది. తులసి, ఉసిరి మాత్రం ఇసుమంతైన అసూయ లేకుండా అనురాగపురితంగా ఉండడంతో విష్ణువు మనస్సును ఆకర్షించాయి. అప్పుడు విష్ణువు మొహం తొలగిపోయి తులసి, ఉసిరి సమేతంగా దర్శనమిచ్చాడు.
తులసి వనం ఉన్నచోట పుణ్యతీర్థం ఉన్నట్లే లెక్క. సర్వపాపాలను నశింపచేస్తుంది. తులసి సేవనం గంగాస్నానం, నర్మదా దర్శనంతో సమానం. ఈ మొక్కను నాటిన, తాకిన, పెంచినా సర్వపాపాలు హరిస్తాయి. ద్వాదశి నాడు మాత్రం ఎవరూ తులసిదళాలను కోయకూడదు. ఉసిరి చెట్టు కూడా అత్యంత పవిత్రమయినదని కార్తిక పురాణం పేర్కొంటోంది. ఉసిరి కాయలను తాకిన, పాత్రలతో కాని, కాయలతో కాని దేవతపూజ చేసినా అత్యంత పుణ్యదాయకమవుతుంది. సమస్త దేవతలు కార్తిక మాసంలో ఉసిరిచెట్టుని ఆశ్రయించి ఉంటారు. ఈ చెట్టు నీడన కార్తికంలో భోజనంచేస్తే సంవత్సర పాపదోషం నశిస్తుంది. ఈ చెట్టు నీడన విష్ణుపూజ పుణ్యదాయకం. ఇలా ఉసిరి, తులసి మహాత్మ్యాన్ని కార్తీకపురాణం పేర్కొంటోంది. నేటి కాలంలో కూడా తులసి, ఉసిరి గుణాలను ఎన్నింటినో మనం గుర్తిస్తూనే ఉన్నాం.
No comments:
Post a Comment