విశ్వామిత్రుడు అనగానే కోపానికి ప్రతీకగా కొందరు భావిస్తుంటారు. కానీ ఆ మహార్శిలో ఇంకా ఎన్నెన్నో ఆదర్శ గుణాలు ఉన్నాయి. ఆయన హితైషి. ఆయన గురించి స్వయంగా విశిష్ట మహర్షి తెలియజెప్పిన కథ సందర్భం ఒకటి రామాయణ బాలకాండ ఇరవై ఒకటో సర్గలో కనిపిస్తుంది.
దశరథుడు మహారాజు విశ్వామిత్రుడికిచ్చిన మాట ప్రకారం తన పుత్రులను పంపడం ఇష్టం లేదని వారు పెళ్లి కావలసినవరైనప్పటికి ఇంకా పసివారని, రాక్షస సంహారం చేయలేరని విశ్వామిత్రుడికి చెప్పాడు. దశరథుడు ఇలా సందిగ్ధస్థితిలో ఉండడం చూసి విశ్వామిత్రుడికి దశరథుడిపైన కోపం వచ్చింది వెంటనే ఆయన దశరథుడిని హెచ్చరిస్తూ మాట తప్పడం నీ వంశానికే కలంకమని, నీవరితో నీవు సుఖంగా ఉండు అని కోపోద్రిక్తంగా అన్నాడు. అలా అంటూ ఉండగానే భూమండలం అంత కంపించింది. దేవతలు భయగ్రస్తులయ్యారు. ఇదంతా వశిష్ట మహర్షి చూసి దశరథుడికి సత్యమేదో తెలియచెప్పడానికి చేసిన ప్రయత్నం ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు మంచేదో, చెడేదో చెప్పే ప్రయత్నం చేయాలన్న ఆర్యోక్తిని ఇక్కడ ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది.
వశిష్టుడు దశరథుడిని అనునయిస్తూ...ఆడిన మాట నిలబెడితే అశ్వమేధ యాగఫలం దక్కుతుంది, మాట తప్పితే పూర్వ పుణ్యఫలం నశిస్తుంది. విశ్వామిత్రుడు అసామాన్యుడు, అయన రక్షణలో రాముడు అగ్ని రక్షణలో ఉన్న అమృతంలా చక్కగా ఉంటాడు.కనుక నిస్సందేహంగా రామలక్ష్మణులను అయన వెంట పంపవచ్చు. మూడు లోకాల్లో ఆయనను మించినవాడు, అస్త్ర ప్రయోగాలూ తెలిసిన వాడు ఎవరు లేరు కనుక రాముడిని పంపాలి.ధర్మాత్ముడైన ఆ రుషి తానే స్వయంగా రాక్షసులను నిగ్రహించగల సమర్థుడే కాని రామలక్ష్మణులకు మేలు చేయడానికే నిన్ను ఇలా అభ్యర్తిస్తున్నాడు అని వశిష్టుడు దశరథుడికి విశ్వామిత్రుడి విశిష్టత గురించి చక్కగా వివరించి చెప్పాడు. అప్పటి వరకు స్వార్థంతో, ప్రేమతో నిండిన ఆ రాజు మనస్సు మారి ఒప్పుకున్నాడు.
సందిగ్ధ అవస్తలో ఉన్న వ్యక్తికి చక్కటి ఉపాయం చెప్పే హితుడికి ప్రతిరూపంగా వశిష్టుడు ఈ ఘట్టంలో కనిపిస్తాడు. వశిష్టుడి మాటలు విన్న తరువాతే రామలక్ష్మణులను విశ్వామిత్రుడివెంట పంపడానికి దశరథుడు అంగీకరించాడు.ఈ కథ సందర్భం విశ్వామిత్రుడి విశిష్టత గురించి, ప్రతి మనిషి జీవితంలో హితుల పాత్ర ఏ మేరకు ఉంటుందో సూచనప్రాయంగా తెలియజేస్తుంది.
No comments:
Post a Comment