Sunday 15 May 2011

పురాణాలలో ధ్యానం

ధ్యానం గురించి పురాణాలలో చాల చోట్లలో ప్రస్తవితమైవుంది. ధ్యాన యోగాన్ని అవలంబించేవారు మనసులో ఎవరిని ధ్యానించాలి? ఎలా ధ్యానించాలి? ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను వ్యాస భాగవతంలోని రెండో అధ్యాయంలో ఉన్న ఈ ఒక కథ సందర్భం వివరిస్తుంది.
    యోగి ఒక విషయాన్నీ గమనించాలి. అదేమంటే ఆ అనంత స్వరూపుడైన ఆ పరంధాముడు మనిషి చిత్తంలోనే ఉన్నాడు. దీనినే ఆత్మ అని అంటారు. ఇది అసత్యం కాదు, దీనికి అసలు నాశనం లేదు. దీనినే ధ్యానాన్ని అవలంబించే యోగులు తమ మనసులో ధ్యానించాలి. అప్పుడే అవిద్య అంతరించిపోతుంది. ఇలా కాక మరో పద్ధతిలో కూడా ధ్యనించవచ్చు. ధ్యానించేవాడు తన చిత్తంలోని భగవంతుడిని గుర్తించి ధ్యానించలేనప్పుడు ఆ భగవంతుడి స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానించవచ్చు. ఆయన స్వరూపం ఒక క్రమపద్ధతిలో ఇలా ఉంటుంది.
    ఆ స్వామి శంఖ, చక్ర, గదా పద్మాలతో నాలుగు చేతులతో ఉంటాడు. పద్మపత్రాల్లాంటి కళ్ళుంటాయి. కదంబ కేసరాల్లాగా పచ్చని రంగులో ఉండే పట్టు వస్త్రాలను ధరించి ఉంటాడు. రత్నాలు చెక్కిన బంగారు కడియాలు చేతులకు, ఉజ్వలమైన మణులతో ధగధగలాడే కిరీటాన్ని ధరించి ఉంటాడు. చెవులు రత్నకుండలాలతో మెరిసిపోతుంటాడు. హృదయం మీద శ్రీవత్స చిహ్నం, కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉంటాయి. అన్నిటికి మించి వెలుగొందే వనమాలను ధరించి ఉంటాడు. అలాంటి ఆ నారాయణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని ధ్యానించాలి యోగులు. నడుముకు రత్నాల మొలతాడు, వేళ్ళకు బంగారు ఉంగరాలు, కాళ్ళకు మూపురాలు, చేతులకు కంకణాలు ధ్యానించే వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్వామి నుదిటి మీద ఉంగరాలు తిరిగిన నల్లటి ముంగురులు కదలాడుతూ కనిపిస్తాయి. చిరునవ్వుతో కళకళలాడే ఆ స్వామి ముఖం, నవ్వుతు నాట్యమాడే కనుబొమ్మలతో నిరంతరం అనుగ్రహ వీక్షణాలతో ఉండే ఆ స్వామి ధ్యానించే వారికి ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాడు. యోగి ఇలాంటి దివ్యముర్తిని తన మదిలో ధారణ నిలిచినంతసేపు ధ్యానం చేస్తూ ఉండాలి.
    ఆయన పాదాలు మొదలుకొని ముఖం వరకు ప్రతి అంగాన్ని ధారణ పూర్వకంగా ధ్యానించాలి. మనస్సును ఆయన మీద తప్ప మరెక్కడా నిలపకూడదు. బుద్ధిని నిశ్చలంగా, పవిత్రంగా ఉండేలా చూడాలి. ఇతర విషయాలపై మనసును పోనివ్వకుండా ఏకాగ్ర చిత్తంతో స్వామిని ధ్యానించాలి. ముందుగా సుఖాసనం మీద కూర్చొని ప్రాణయామం చేయాలి. అలా ప్రాణవాయువుని నిరోధిస్తు ఇంద్రియాలను గెలవటం అలవాటు చేసుకోవాలి. నిర్మల బుద్ధితో మనసుని స్థిరపరచి తిరిగి బుద్ధిని ఆత్మతో స్థిరపరచాలి. ఇలా ఆత్మను అంతరాత్మలో లీనం చేయాలి. అంతరాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి శాంతిమయ స్థితిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ స్థితిలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఏదీ ఉండదు. అహంకారం, మహత్తత్వం, ప్రకృతి లాంటివేమీ ఉండవు. యోగి ఈ స్థితికి చేరుకోవాలి. ఈ స్థితి ఉత్తమోత్తమ స్థితి. అతడు అవిద్య నుంచి విముక్తుడవుతాడు.

No comments:

Post a Comment