Tuesday 24 May 2011

ఉత్తమలక్షణం క్షమ

మనిషికి క్షమాగుణం ఎంతగా ఉపయోగపడుతుందో, జటిలమైన సమస్యలు దీని ద్వారా ఎంత సులభంగా పరిష్కరించబడతాయో కొన్ని పురాణ పరమైన కథలు తెలియజేస్తాయి. ఆ కోవకు చెందిన ఒక కథ రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడి పూర్వచరిత్రకు సంబంధించి ఉంది.
    పూర్వం కుశుడు అనే గొప్ప తపోధనుడు ఉండేవాడు అతడు ఎంతో ధర్మాత్ముడు. ఈయనకు విదర్భ రాజు కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు కలిగారు. వీరిలో కుశనాభుడు ఒకడు. ఇతను మహొదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతు ఉండేవాడు. ఇతడు ఘ్రుతాచి అనే అప్సరసను వివాహమాడాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కలిగారు. వీరు తండ్రి ధర్మలక్షణాలు, తల్లి అందచందాలు కలగలిసి, గొప్ప జ్ఞానవంతులుగా పెరిగి పెద్దయ్యారు.
    ఒక రోజు ఈ రాకుమార్తెలు వన విహారానికి వెళ్లారు. అక్కడ వీరు ఆడుకొంటూ ఉండగా పెద్ద గాలి వీచి వాయుదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వాయుదేవుణ్ణి చూసి వినయ సంపన్నులైన రాకుమార్తెలు ఆయనకు నమస్కరించారు. వాయువు వారితో తాను ఆ ముగ్గురిని చూసి సమ్మోహితుడైనట్లు చెప్పి తనను వివాహమాడాలని కోరాడు. రాకుమార్తెలు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. వెంటనే వారు వాయువుతో తాము తండ్రి చాటు బిడ్డలమని, వివాహం విషయంలో తండ్రి అనుమతి లేనిదే తామేమి మాట్లాడబోమని అన్నారు.వాయుదేవుడు తనను పెళ్లాడితే నిత్య యౌవ్వనం లభిస్తుందని, కాదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయిన ఆ ముగ్గురు రాకుమార్తెలు తండ్రి మాటే తమదని కచ్చితంగా తెగేసి చెప్పారు. దాంతో వాయుదేవుడికి కోపం వచ్చి ఆ ముగ్గురిని అందవిహీనులై, గూని వారుగా మారిపొమ్మని శపించి వెళ్ళిపోయాడు. అయిన వారు బాధ పడలేదు, వారికి వాయుదేవుడిని శపించెంత శక్తి ఉన్న వారు ఆ పని చేయలేదు. తండ్రి దగ్గరికి వచ్చి విషయాన్నంతా వివరించారు. కుశనాభుడు తన కుమార్తెలకు తగిన వరుణ్ణి వెదికి బ్రహ్మదత్తుడనే గొప్ప తపోశక్తి కలిగిన రాజుకి ఇచ్చి వివాహం చేయించాడు. దాంతో వారికి శాపం తొలగిపోయి వారి నిజరూపాలు వచ్చాయి. కుశనాభుడు తర్వాత పుత్రకామేష్టి యాగం చేసి గాధి అనే కుమారున్ని పొందాడు. గాధికి విశ్వామిత్రుడు, సత్యవతి జన్మించారు. సత్యవతి విశ్వామిత్రుడి అక్క.
    ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది రాకుమార్తెల క్షమాగుణం. తమకు వాయుదేవుణ్ణి శపించెంత శక్తి ఉన్నప్పటికీ క్షమ గుణాన్ని ప్రదర్శించి ఓర్పు వహించారు. విషయం మరింత తీవ్రం అవ్వకుడదని వాయువు పై కోపాన్ని చూపక తమ తండ్రికి విషయాన్నీ తెలియజేసారు. కొద్దిగా ఆలోచిస్తే ఓర్పు, క్షమా అనే గుణాల్ని కలిగి ఉండటం మేలు అని తెలియజేస్తుంది ఈ కథ సందర్భం.

No comments:

Post a Comment